Telangana DGP Mahender Reddy (Photo-Video grab)

Hyderabad, June 27: దొంగతనం చేశారంటూ పాస్టర్ పెట్టిన కేసులో అరెస్టయిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌లో మృతి (Mariyamma Lockup Death Case) చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ ఖమ్మం జిల్లాలోని సంకల్ప ఆ‍స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఆదివారం పరామర్శించారు. లాకప్‌డెత్‌ ఘటనపై కుటుంబసభ్యుల నుంచి డీజీపీ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు అడ్డగూడురులో (Addagudur Police Station Incident) ఏం జరిగిందని, ఎవరు మరియమ్మ, ఉదయ్‌ కిరణ్‌ను కొట్టారని అడిగి తెలుసుకున్నారు.

విచారణ సమయంలో వారిని ఎంతమంది కొట్టారని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.డీజీపీ ముందు ఉదయ్‌ కిరణ్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు తమను అత్యంత క్రూరంగా కొట్టారని డీజీపీకి తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఉదయ్ కిరణ్ డీజీపీని వేడుకున్నాడు. ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశామని చెప్పారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరియమ్మ ఘటన బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీజీపీ తెలిపారు. మరియమ్మ కుటుంబం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు. రూల్స్ విరుద్ధంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు, మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

లాకప్ డెత్ కేసు వివరాల్లోకెళితే.. అడ్డగూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్‌ బాలశౌరి ఇంట్లో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లకుంటకు చెందిన మరియమ్మ వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ నెల 3న మరియమ్మ దగ్గరికి తన కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌ వచ్చారు. ఇక 5వ తేదీ పాస్టర్‌ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లాడు. 6వ తేదీన తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తన ఇంట్లో రూ.2 లక్షల దొంగతనం జరిగిందని ఈ నెల 16న అతను అడ్డగూడూరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.

అయితే దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసిన ముందు రోజు మరియమ్మ కుమారుడితో కలిసి స్వగ్రామమైన కోమట్లకుంటకు వెళ్లిపోయింది. కేసు నేపథ్యంలో పోలీసులు పాస్టర్‌కు చెందిన కారులో 17న కోమట్లకుంటకు వెళ్లి మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌ను 18న ఉదయం 8 గంటలలోపు అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. అయితే డబ్బులు పోయిన 10 రోజుల తర్వాత కేసు నమోదు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఈ ఘటన తర్వాత మరియమ్మ, ఆమె కుమారుడు, మరో యువకుడిని అడ్డగూడూరు పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లారు. అనంతరం లాకప్ లోనే మరియమ్మ చనిపోగా కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రజా సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు సైతం ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలేరు కోర్టును ఆదేశించింది. అదేవిధంగా రీపోస్ట్‌మార్టం చేయించాలని, బాధ్యులైన పోలీ సులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలీసులపై చర్యలు ప్రారంభం

దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభం అయ్యాయి. చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్యను కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ సీపీ మహేశ్‌ భగవత్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అడ్డగూడురు ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రైటర్‌ రషీద్‌లను ఈనెల 19న భువనగిరి డీసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఆ తరువాత సస్పెండ్‌ చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జడ్జితోపాటు పోలీస్‌శాఖ పరంగా మరికొంత మంది పోలీస్‌ అధికారులపై విచారణ ప్రారంభించారు.