Hyderabad, August 31: తెలంగాణలో బుధవారం నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. హైకోర్ట్ మంగళవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అడ్వొకేట్ జనరల్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చర్చించారు. గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలను తెరవటానికి హైకోర్ట్ అనుమతి ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఏజీ వివరణ ఇచ్చారు. దీంతో హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా పలు సవరణలు చేస్తూ, సెప్టెంబర్ 1 నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల ప్రారంభం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీచేసింది. ఆఫ్‌లైన్‌తో పాటు అన్‌లైన్‌లోనూ స్కూళ్లు కొనసాగుతాయని తెలిపింది. అయితే, హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రెసిడెన్షియల్, గురుకులాలను మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75,207 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 338 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,639 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,58,054కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 84 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 30 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 1 కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,873కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 364 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,48,317 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,864 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.