Elections | Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, April 17: రాష్ట్రంలో మినీ మునిసిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఎన్నికలు (Telangana Municipal Elections 2021) జరగాల్సిన రెండు కార్పొరేషన్లు; ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్‌ పార్థసారథి గురువారం షెడ్యూల్‌ జారీ చేశారు. అలాగే, ఖాళీగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18వ డివిజన్‌కు; గజ్వేల్‌లోని 12వ వార్డు, నల్లగొండలోని 26వ వార్డు, జల్‌పల్లిలోని 28వ వార్డు, అలంపూర్‌లోని 5వ వార్డు, బోధన్‌లోని 18వ వార్డు, పరకాలలోని 9వ వార్డు, మెట్‌పల్లిలోని 8వ వార్డు, బెల్లంపల్లిలోని 30వ వార్డుకు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. వాటన్నిటికీ ఏప్రిల్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు.

ఈ మేరకు 16న అంటే శుక్రవారమే నోటిఫికేషన్లను విడుదల చేసింది. నామినేషన్ల స్వీకరణను ప్రారంభమైంది. మే 3న కౌంటింగ్‌ చేపట్టి, ఫలితాలను వెల్లడించేలా ఎస్‌ఈసీ షెడ్యూల్‌ను జారీ చేసింది. దాంతో, గురువారం నుంచే ఆయా ప్రాంతాల్లో కోడ్‌ అమల్లోకి వచ్చింది. మొత్తంగా 1,532 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను కూడా వీడియోగ్రఫీ లేదా వెబ్‌ కాస్టింగ్‌ లేదా మైక్రో అబ్జర్వర్లలో ఏదో ఒక దాని పర్యవేక్షణలో ఉంచుతారు.

మునిసిపల్‌ ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాలపైనే నిర్వహించనున్నారు. ఇందుకు 2,479 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. కాగా, వార్డు సభ్యుల పదవికి పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1,250 చెల్లిస్తే చాలు. డివిజన్లకు పోటీ చేసేవారు రూ.5 వేలను డిపాజిట్‌గా చెల్లించాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500 చెల్లిస్తే చాలు. ఇక, జీహెచ్‌ఎంసీలో డివిజన్‌కు పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.1.5 లక్షలు, వార్డులకు పోటీ చే సే అభ్యర్థుల వ్యయ పరిమితి లక్ష రూపాయలు మాత్రమే.

సాగర్ ఉప ఎన్నికల్లో 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదు, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్, మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో..

మునిసిపల్‌ ఎన్నికలు (two municipal corporations, five municipalities) జరగనున్న రెండు కార్పొరేషన్లు; ఐదు మునిసిపాలిటీలు ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలో 11,26,221 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,53,862 మంది పురుషులు, 5,72,121 మంది మహిళలు, 236 మంది ఇతరులు. ఇక, వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్‌లు, వార్డులలోని ఓటర్లు వీరికి అదనం. మొత్తంగా 11.5 లక్షల మందికిపైగా ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతున్నారు.

మినీ మునిసిపల్‌ ఎన్నికలకు కరోనా కట్టడి నిబంధనలను పాటించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఇంటింటి ప్రచారానికి వెళ్లే సమయంలో అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే వెళ్లాలి (భద్రతా సిబ్బంది అదనం). ప్రచారం కాన్వాయ్‌గా వెళితే.. వరుసగా రెండు వాహనాలకే అనుమతి. ఆ తర్వాత వచ్చే వాహనాల శ్రేణి కనీసం 10 మీటర్ల దూరం ఉండాలి.

అలాగే, ఒకే మార్గం లేదా దారిలో రెండు వేర్వేరు పార్టీల లేదా అభ్యర్థులు ప్రచార ర్యాలీలు నిర్వహిస్తే.. వాటి మధ్య వ్యవధి కనీసం అరగంట ఉండాలి. ర్యాలీలు, సభలకు విఽధిగా కరోనా కట్టడి నిబంధనలు పాటించాలి. పోలింగ్‌ కేంద్రాలను ఒకరోజు ముందుగానే శానిటైజ్‌ చేయాలి. భౌతిక దూరం పాటించాలి. విధిగా మాస్కులు ధరించాలి. లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు.

ఎన్నికలు జరిగే ప్రాంతాలు

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ 66 డివిజన్లు

ఖమ్మం కార్పొరేషన్‌ 60 డివిజన్లు

అచ్చంపేట మునిసిపాలిటీ 20 వార్డులు

సిద్దిపేట మునిసిపాలిటీ 43 వార్డులు

నకిరేకల్‌ మునిసిపాలిటీ 20 వార్డులు

జడ్చర్ల మునిసిపాలిటీ 27 వార్డులు

కొత్తూరు మునిసిపాలిటీ 12 వార్డులు

ఎన్నికల షెడ్యూల్‌

ఏప్రిల్‌ 16 నోటిఫికేషన్‌ జారీ, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్‌ 18 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

ఏప్రిల్‌ 19 నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్‌ 20 అప్పీళ్లకు అవకాశం

(జీహెచ్‌ఎంసీ విషయంలో 19న పరిశీలన, 20న ఉప సంహరణ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అప్పీళ్లకు అవకాశం లేదని ఎస్‌ఈసీ పేర్కొంది. అదే రోజు సాయంత్రం తుది జాబితా ప్రకటిస్తారు)

ఏప్రిల్‌ 21 అప్పీళ్ల పరిష్కారం

ఏప్రిల్‌ 22 నామినేషన్ల ఉప సంహరణ. ఆ వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన

ఏప్రిల్‌ 30 పోలింగ్‌, ఉ. 7 గంటల నుంచి సా.5 గంటల వరకు

అవసరమైన పక్షంలో మే 2 రీ పోలింగ్‌

మే 3 ఓట్ల లెక్కింపు, ఉ.8 గంటల నుంచి