PM Modi Election Campaign in Telangana

Vemulawada, May 7: తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అవినీతిలో గత ప్రభుత్వాన్నే అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు.

ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దింపిందని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయమే వేములవాడ చేరుకున్న ప్రధాని.. ముందుగా రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి భారీగా వచ్చిన జనం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వీడియో ఇదిగో, వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, కోడె మొక్కులు చెల్లింపు

ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’(రేవంత్ రెడ్డి) ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన మూడు దశల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవమే ఎదురైందని చెప్పారు. మిగతా నాలుగు దశలలోనూ ఆ పార్టీకి ఓట్లు రాలవని చెప్పారు. బీజేపీ, ఎన్డీయే కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు.  తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ, తొలిసారిగా తన తల్లి కాళ్లు తాకకుండా నామినేషన్ దాఖలు చేసానంటూ భావోద్వేగం

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మీరు వేసిన ఓటే కారణమని మోదీ చెప్పారు. బీజేపీకి రెండు పర్యాయాలు మీరు ఇచ్చిన అవకాశం వల్లే ఇప్పుడు దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వివరించారు. ఈ క్రమంలోనే మరోసారి మీ ఆశీర్వాదం కోరేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తే తమ కలలు సాకారమవుతాయని ప్రజలు భావించారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసమే పనిచేసిందని ఆరోపించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పని కూడా ఇదేనని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని, వాటికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. అవి రెండూ ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసులాంటి వని చెప్పారు. బీజేపీ మాత్రమే దేశానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం మచ్చుకు కూడా కనిపించడంలేదని, కాంగ్రెస్ పార్టీ అడ్రసు కూడా ఈ ఎన్నికల్లో గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.

అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, వాటి మధ్య ఫెవికాల్ బంధం ఉందని మోదీ విమర్శించారు. తెర ముందు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, తెరవెనుక మాత్రం సిండికేట్ గా మారతారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాఫ్తు జరిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతి అనేది కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లో కనిపించే ఉమ్మడి లక్షణం. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు బీఆర్ఎస్‌ చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కాంపై.. చర్యలు తీసుకోవట్లేదు. అవినీతి సిండికేట్‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ భాగస్వాములు. ఆర్ఆర్ ట్యాక్స్‌ అంటే తెలంగాణలో ప్రతిఒక్కరికీ తెలుసు. వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఆర్ఆర్ ట్యాక్స్‌ మించిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. ఆర్ఆర్ మాత్రం కొన్ని రోజుల్లోనే వెయ్యి కోట్లు దాటేసింది.

ఆర్ఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. అంబానీ, అదానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆపేసింది. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుంది? ఈ గుట్టల కొద్దీ డబ్బు గురించి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌లో ఎంఐఎంను గెలిపించడానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు పని చేస్తున్నాయి. కాంగ్రెస్‌ చేస్తున్న రాజకీయాలు ఓబీసీలకు నష్టం. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోంది. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోందని మండిపడ్డారు.