Srisailam Dam | Photo: Twitter

Hyd, Oct 26: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ (Telangana ENC Chief) రెండు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలను తుంగలో తొక్కి నాగార్జున సాగర్ ఎడమకాలువను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయారని లేఖలో ఆరోపించారు.గత ప్రభుత్వాలు ప్రాజెక్టు రిపోర్టును ఖాతరు చేయలేదని తెలిపారు.

ఏపీ (Andhra pradesh) చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరారు. పిన్నపురం ప్రాజెక్టుకు ఏపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు నీరే తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా బేసిన్ ఆవలకు కూడా ఏపీ భారీగా నీటిని తరలిస్తోందని ఆరోపించారు. ఏపీ తీరుతో తెలంగాణలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు.

అంతేకాకుండా, ఏపీలో ఆయకట్టు పెరుగుతోందని తెలిపారు. 1952లో ఏపీలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు ఉండగా, ప్రాజెక్టు రిపోర్టుకు భిన్నంగా 1956 తర్వాత ఆయకట్టు పెంచారని వెల్లడించారు. ఏపీలో ఆయకట్టును 3.78 లక్షల ఎకరాలకు పెంచారని తెలంగాణ ఈఎన్సీ తన లేఖలో తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో ఆయకట్టును 60 వేల ఎకరాలకు తగ్గించారని వివరించారు. 1969లో ఏపీలో ఆయకట్టును 1.3 లక్షల ఎకరాలకు కుదిస్తూ ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

ఆ ఆదేశాలను పాటించని పరిస్థితి నెలకొందని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు, బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు 1954లో చేసిన ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలి. జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్ 2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలి. ఈ అంశాలను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నివేదించాలని ఈఎన్ సీ తన లేఖలో పేర్కొన్నారు.

1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలూకాలోని కట్లేరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారని లేఖలో పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేదని ఈఎన్ సీ గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి ఎత్తిపోసిన నీటీతో చేపట్టిన హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని గతంలొనే తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ కృష్ణా బోర్టు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్ లో నాలుగు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టగానికి కేఆర్ఎంబీ, ఆపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందలేదు. ఈ ప్రాజెక్టులన్నీ కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన నీటి ఆధారంగాగానే ప్రతిపాదించారు.

శ్రీశైలం జలాజయం నుంచి ఏపీ ప్రభుత్వం కేవలం 34 టీఎంసీలు (15 టీఎంసీలు తాగునీటికి+19 టీఎంసీలు శ్రీశైలం కుడి కాలువకు) మాత్రమే తరలించాలి. కాని పోతిరెడ్డిపాడు ద్వారా దాని కింద ఉన్న బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోసి ఆయా రిజర్వాయర్ల నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రెండో లేఖలో మురళీదర్ పేర్కొన్నారు.