Harish Rao tested positve for Corona (photo-PTI)

Hyd, Dec 22: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై (Paddy Procurement in TS) కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ (Union Minister Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై బుధవారం మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి గోయల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. కేంద్రమంత్రిగా (Telangana Finance Minister Harish Rao) కాకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడారని, రాష్ట్రంతో వ్యవహరించే తీరుగా ప్రవర్తించలేదన్నారు.

మంత్రులు 70లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఢిల్లీకి వచ్చారని, వారిని కేంద్రమంత్రి మీకేం పని లేదా? అంటారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడం, 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. వెంటనే పీయూష్‌ గోయల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 70లక్షల రైతు కుటుంబాలు ఆగమవుతున్నాయని, నిన్నగాక మొన్న బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పారని, రేపు రా రైస్‌ కూడా కొనమని చెతులెత్తేస్తే మా రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. ఓ వైపు రైతుల కళ్లాల వద్ద పడిగాపులు పడుతున్నారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది, రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలోనే ఒప్పందం, మీడియాతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

మీరిచ్చిన 40లక్షల మెట్రిక్‌ టన్నుల కోటా పూర్తయ్యింది, ఆ తర్వాత కొంటరా కొనరా? అని అడిగేందుకు రైతుల బృందం ఢిల్లీకి వచ్చారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అభ్యర్థన చేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానపరచడం సరికాదన్నారు. మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బృందం వస్తే కలిసేందుకు మీకు సమయం లేదా? అని హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రుల బృందాన్ని కలువకుండా.. స్థానిక బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని సమావేశమయ్యేందుకు సమయం దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున వచ్చిన బృందాన్ని మొదట కలుస్తారా.. లేదంటే రాజకీయ నేతలను, బీజేపీ నేతలు, కార్యకర్తలను కలిసి.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ అన్నారు. కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలోకి అధికారం చేపట్టగానే మోసం చేసింది మీరు కాదా? అన్నారు. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి.. చావు దగ్గర వరకు వెళ్లి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీదన్నారు. మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. మీరన్న 40లక్షల మెట్రిక్‌ టన్నులకు అలాట్‌మెంట్‌ ఇచ్చారని, ఇప్పటికే 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. ఇంకా 20 నుంచి 30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతుల చలిలో పడిగాపులు కాస్తున్నారన్నారు.

ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయాన్ని రాతపూర్వకంగా చెప్పాలని రాష్ట్రం తరఫున అధికారికంగా బృందం వస్తే స్పందించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మూడు రోజులైనా మంత్రులను కలువకుండా, బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని. వారికి సమయం కేటాయించి మాట్లాడి.. రాజకీయం చేసింది కేంద్రమంత్రేనన్నారు. తెలంగాణ మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. ఇదేనా కేంద్రమంత్రి ప్రాధాన్యం అని ప్రశ్నించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ రైతాంగం, ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.