Telangana Floods: అంతా రామయ్యపైనే భారం, గోదావరి ఉగ్రరూపంతో డేంజర్ జోన్లో భద్రాచలం, సాయంత్రం నుంచి రాకపోకలు బంద్, 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
Badrachalam (Photo-File Image)

Hyd, July 14: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటి మట్టం 60. 30 అడుగులకు చేరుకోవడంతో సమీపంలోని లోతట్టు కాలనీలను వరద (Telangana Floods) ముంచెత్తింది. సుభాస్ నగర్, రామాలయం పరిసరాలు, అయ్యప్పకాలనీ, కొత్త కాలనీ వంటి ప్రాంతాల్లో ప్రజలను (6000 People Evacuated) పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి నీటి మట్టం 60 నుంచి 70 అడుగులకు చేరుతుందనే అంచనాతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, బూర్గం పహడ్, అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో దాదాపు ఆరువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోనే మకాం వేసి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

శాంతించని వరుణుడు, నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు, 12 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని తెలిపిన సీఎం కేసీఆర్

గోదావరికి వరద ప్రభావం ఎక్కువ కావడంతో భద్రాచలం నుంచి కూనవరం, చర్ల వెళ్లే దారులు మూతపడ్డాయి. ఈ రోజు సాయంత్రం 5 నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలు (Bhadrachalam Cut-Off As Bridge) నిలిపివేశారు. దీంతో భద్రాచలం నుంచి హైదరాబాద్ ప్రధాన రహదారిపై రవాణా నిలిచిపోవడంతో మన్యం ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలంలో 144 సెక్షన్‌ విధించారు. 48 గంటలపాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద ముంపు దృష్ట్యా వంతెనపై రెండ్రోజులపాటు రాకపోకలు ఆపేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో ఈ గండం గడిస్తే చాలు భగవంతుడా అంటూ గోదావరి పరివాహక ప్రాంత వాసులు వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి తుదిప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి నెల్లిపాకవెళ్లే మార్గంలో పురుషోత్తపట్నం వద్ద వాహనాలను వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులపై వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా ఏపీ, తెలంగాణ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, జల దిగ్భంధంలో పలు గ్రామాలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది, ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు

అరుదుగా వరదలొచ్చే నదులు పొంగిపొర్లడంతో మూకుమ్మడిగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, పెన్‌గంగా, వార్ధా నదులు వరదలతో ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్‌, కడెం నుంచి దిగువకు భారీగా వరద నీరు విడుదల అవుతోంది. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పలిమెల పోలీస్‌ స్టేషన్‌ నీట మునిగింది. మేడిగడ్డ కంట్రోల్‌ రూంలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, కానిస్టేబుళ్లు కొందరు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం.

ఇక తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. మరో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండడంతో.. మిగతా చోట్ల సైతం సాధారణం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గోదావరి నదిలో గల్లంతైన 9 మంది సేఫ్, రెండు బోట్లలో బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఇక ఏపీలో ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉదృతంగా ఉంది. నీటిమట్టం 16 అడుగులు దాటింది. 17.75 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అదే జరిగితే ఆరు జిల్లాలపై ప్రభావం పడనుంది. 42 మండలాల్లోని 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపులోకి మరికొన్ని ప్రాంతాలు. ఆచంట, యలంచిలి మండలాల్లో లంకగ్రామాలు నీట మునగ్గా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక చర్యల్లో ఏడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐదు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొంటున్నాయి. స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఏపీ విపత్తుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి జిల్లాలు డేంజర్‌ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులతో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.