dharmapuri srinivas (photo-Twitter)

Hyd, Mar 27: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ చేరిన ఒక్క రోజుకే కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ (TS Congress) గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ పంపారు. మరోవైపు.. ఆయన సతీమణి విజయలక్ష్మి (DS Wife Vijayalakshmi) కూడా మరో లేఖను విడుదల చేశారు.

డీఎస్‌ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్‌ వాళ్లు తమ ఇంటి వైపుకు రావొద్దని డీఎస్‌ భార్య విజ్ఞప్తి చేశారు. కాగా తొలుత కాంగ్రెస్‌ నేత అయిన డీఎస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్‌ఎస్‌(ప్రస్తుత బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కొంతకాలంగా బీఆర్ఎస్‌కు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఢిల్లీ మద్యం కేసు, ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఈ క్రమంలో ఆదివారం తన కొడుకు సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్‌.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా డీఎస్‌ మరో కొడుకు అర్వింద్‌ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

ఉచిత వైపైతో నేటి నుంచే టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు, లహరి బస్సుల్లో టికెట్ ధరలు, బస్సు సౌకర్యాలు ఓ సారి తెలుసుకుందామా..

ఇటీవల అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న డీఎస్‌.. గాంధీభవన్‌కు (Gandhi Bhavan) వీల్‌ చెయిర్‌లోనే వచ్చారు. తన కుమారుడు సంజయ్‌ రాజకీయ భవిష్యత్తు, తన ఎదుగుదలకు దోహదపడిన కాంగ్రెస్‌ లోనే చివరి వరకు కొనసాగాలన్న ఆకాంక్షతో మార్చి 26న పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. దీంతో 24 గంటల్లోనే ఏం జరిగిందో అని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్కే నడుస్తోంది.

డీఎస్ లేఖ ఇదే..

‘ఈ నెల 26న నా కుమారుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా, ఆశీస్సులు అందజేయడానికి గాంధీ భవన్‌కు వెళ్లిన నాకు కండువా కప్పి, నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు.

కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి, ఆమోదించవల్సిందిగా కోరుకుంటున్నాను’ అని డీఎస్ తన లేఖలో రాసుకొచ్చారు.

డీఎస్ సతీమణి లేఖలో ఇలా..!

‘ఇగో డీఎస్ గారి రాజీనామా! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. ఆయన్ను పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయన్ను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నా.. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ప్రశాంతంగా బతకనీయండి’ అని డీఎస్ సతీమణి కాస్త ఘాటుగానే లేఖ విడుదల చేశారు. లేఖతో పాటు అటు డీఎస్.. ఇటు విజయలక్ష్మి వీడియోలు కూడా రిలీజ్ చేశారు.