స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.12,400 కోట్లకు పైగా అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీలతో నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024లో ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం , గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీని ఉపయోగించే 100 మెగావాట్ల డేటా సెంటర్‌లో రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేకాకుండా, అదానీ గ్రీన్ రూ. 5,000 కోట్లకు పైగా ఉపయోగించి రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుండగా, అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ రాష్ట్రంలో కౌంటర్-డ్రోన్, క్షిపణి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి.
దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు ఉన్నారు.