Telangana: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకం, జనవరి 1 నుంచి పదవీబాధ్యతలు, సుస్థిర పాలన కోసం సోమేశ్ వైపే మొగ్గు చూపిన సీఎం కేసీఆర్
Telangana New CS Somesh Kumar | Photo: Twitter

Hyderabad, January 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐదవ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) గా సోమేశ్ కుమార్ (Somesh Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (Telangana CMO) ఉత్తర్వులు విడుదల చేసింది. సీఎం సంతకం చేసిన ఉత్తర్వుల ప్రకారం సోమేశ్ కుమార్ 2020 జనవరి 1 నుండి 2023 డిసెంబర్ 31 వరకు మరో నాలుగేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన సీఎస్ పదవిలో కొనసాగుతారు.

నిన్న రిటైర్ అయిన శైలేంద్ర కుమార్ జోషి నుంచి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు సోమేశ్ కుమార్ అందుకున్నారు. ప్రస్తుతం రిటైర్ అయిన జోషిని నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా నియమించాలని సీఎం కేసీఆర్  (CM KCR) నిర్ణయించారు.

ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవి కావడం వల్ల ప్రధాన కార్యదర్శి పదవి కోసం చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పోటీపడ్డారు. అయితే 1989 ఐఏఎస్ బ్యాచ్, బిహార్ కు చెందిన సోమేశ్ కుమార్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలకు సేవలందించారు. పేదరిక నిర్మూలనపై పుస్తకం కూడా రాశారు.

జీహెచ్ఎంసీ కమీషనర్ గా, పన్నులు మరియు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. జీఎస్టీ అమలు, ఆదాయం పెంపుదల చేయడంలో తన సమర్థతను చూపారు.

ఇటు ప్రధాన కార్యదర్శి పదవికాలం ఎక్కువ ఉండటం, సోమేశ్ కుమార్ సీనియారిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పాలన స్థిరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో  ముఖ్యమంత్రి కేసీఆర్ సోమేశ్ కుమార్ వైపే మొగ్గుచూపి ఆయనను సీఎస్ గా నియమించారు.