Hyderabad, Sep 18: తెలంగాణలో వైన్‌షాపుల లైసెన్స్ గడువును ప్రభుత్వం (Liquor Shops License Extended in TS) పొడిగించింది. అక్టోబర్ 31తో ముగియనున్న లైసెన్స్ గడువును నవంబర్ 30 వరకు పెంచింది. అలాగే, మార్జిన్ శాతాన్ని కూడా 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బార్ల యజమానులు.. ఈ నెల 30లోగా మొదటి త్రైమాసిక లైసెన్స్ ఫీజును చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో బార్లకు ఆదాయం తగ్గడంతో ఒక నెల లైసెన్స్ ఫీజు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో 2,200కు పైగా వైన్‌షాపులు ఉండగా.. వాటి లైసెన్స్ గడువు అక్టోబర్ 31తో ముగియనుంది. కరోనా నేపథ్యంలో తమకు నష్టం వాటిల్లిందని, ఇందుకు పరిహారంగా గడువు పొడిగించాలని వైన్‌షాప్ యాజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. లెసెన్స్ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏ-4 దుకాణాల (వైన్ షాప్‌ల) లైసెన్స్ గడువు (Liquor shops licence extended) అక్టోబర్ 31తో ముగుస్తుంది. నవంబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రావాల్సి ఉంది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, నూతన మద్యం పాలసీపై కసరత్తు కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఉన్న దుకాణదారులకే మరో నెలపాటు గడువు ఇచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
దీని ప్రకారం ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుత మద్యం దుకాణదారులను ప్రోత్సహించేలా ఇప్పటికే 10 సార్లు సరుకు తీసుకున్నవారి మార్జిన్‌ను 6.4 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ ఒకటి తర్వాత పదిసార్లు కోటాను దాటినవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తించనున్నది. అదేవిధంగా బార్లకు లైసెన్స్‌ఫీజులో ఒకనెల మొత్తాన్ని రిబేట్ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం బార్ లైసెన్స్ ఫీజును 12 భాగాలుగా చేసి, అందులో ఒక నెల మొత్తాన్ని రిబేట్‌గా ఇస్తారు. ఈ మొత్తాన్ని ఒక్కో నెలలో కొద్దిమొత్తం చొప్పున మినహాయిస్తారు.