Telangana: భవనాలు కూల్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నాయి, హైకోర్టుకు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం, విచారణ రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం
High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, March 4: ప్రస్తుతం ఉన్న సచివాలయ (Telangana Secretariat) భవనాలు వినియోగానికి ఎంత మాత్రం యోగ్యంగా లేవని, ఇప్పుడున్న భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించడం మినహా మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు (High Court) నివేదించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ రాజ్యంగ బద్ధంగా ఉన్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులే సచివాలయ నిర్మాణాలను అడ్డుకునేందుకు కోర్టులో పిటిషన్లు వేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తన ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్ళడానికి అనుమతించాంటూ ఏజీ విజ్ఞప్తి చేశారు.

సచివాలయంలోని ఏ బ్లాక్ 21 ఏళ్ల క్రితం, బీ మరియు సీ బ్లాకులు 41 ఏళ్ల క్రితం, డీ బ్లాక్ 16 ఏళ్ల క్రితం, ఇక జీ బ్లాక్ అయితే 131 ఏళ్ల క్రితం నిర్మించినవని ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందులోని ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ప్లంబింగ్ 25 ఏళ్ల క్రితం నాటివి, గత నాలుగేళ్లుగా 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి, పైపులైన్ల లీకేజీ సమస్య ఉంది, ఆయా బ్లాకులకు అత్యవసర ద్వారాలు, ఫైర్ సేఫ్టీ తదితర వసతులు లేవని చెబుతూ బ్లాకుల వారీగా సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వం 33 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది.

తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయం భవనంలో మంత్రులకు, శాఖాధిపతులకు మరియు ఇతర ఉన్నతాధికారులకు భద్రత కల్పించడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇంజనీర్లు, నిపుణులతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతనే తెలంగాణ ప్రతిష్ఠ తెలిసేలా అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బి.ఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. భవిష్యత్తులో నగర అభివృద్ధి మరియు రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిపుణుల సాంకేతిక కమిటీ మరియు క్యాబినెట్ సబ్-కమిటీ కూడా గత సంవత్సరం ఈ సమస్యను పరిశీలించి, సిఫారసు చేశాయని కూడా ఆయన పేర్కొన్నారు.

రాజకీయ దురుద్దేశాలతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ జన సమితి (టిజెఎస్) ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ రావు సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఈ వ్యాజ్యాలు వేశారు. ఇప్పుడున్న సచివాలయ భవనాలు మరో 70 ఏళ్ల పాటు వినియోగించవచ్చు అని పిటిషనర్లు చేసే వాదనల్లో ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవని కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం, ఈ కేసు తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.