Hyderabad,October 5: ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా బస్సులు ఎక్కడికక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. పోలీసుల భద్రత నడుమ బస్సులను నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బస్సులను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కార్మిక సంఘాలకు సంఘీభావంగా ప్రతిపక్షాలు కూడా మద్ధతు ప్రకటించండంతో సమ్మెకు ఇంకా బలం వచ్చినట్లయింది. కాగా ఆర్టీసి బస్టాండ్ లోకి ప్రైవేటు వాహనాలను సైతం పోలీసులు ఇప్పుడు అనుమతిస్తున్నారు.

సమ్మె ప్రభావం

సాయంత్రం ఆరుగంటల వరకు డెడ్‌లైన్

ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సంస్థలో క్రమశిక్షణను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు సాయంత్రం ఆరుగంటల వరకు డెడ్‌లైన్ విధించింది. ఆలోపు ఆయాడిపోల్లో రిపోర్టుచేసినవారే సంస్థ ఉద్యోగులుగా కొనసాగుతారని, విధుల్లో చేరనివారు తమంతట తాముగా ఉద్యోగాలు వదులుకున్నట్టు భావిస్తామని స్పష్టంచేసింది. యూనియన్ నాయకుల ఉచ్చులో పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని కార్మికులకు హితవుపలికింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రవాణాశాఖ మంత్రి, సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కార్మిక నాయకులతో చర్చల సారాంశాన్ని త్రిసభ్య కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్న సీఎం సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

సమ్మె దెబ్బకు ఇలా.. 

 సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ రద్దు

ఇదిలా ఉంటే ఇకపై కార్మికసంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరుపవద్దని కూడా నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చలకోసం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ రద్దయిపోయింది. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా సందీప్‌కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, దీన్ని ఉల్లంఘించి సమ్మెచేయడం చట్టవిరుద్ధమని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్టవ్యతిరేకంగా సమ్మెచేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉన్నదని చెప్పారు. సమ్మె విషయంలో అధికారులు చట్టప్రకారమే నడుచుకోవాలని సీఎం ఆదేశించారు. కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టంచేశారు. ఆర్టీసీని కాపాడటానికి ప్రభుత్వం ఎంతోచేసిందని, కానీ ఆర్టీసీ కార్మికులే సంస్థను ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడటం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే మోటార్‌ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ ఇండ్రస్టియల్‌ డిస్ప్యూట్స్‌ (ఐడీ) యాక్ట్‌ ప్రకారం చర్చల ప్రొసీడింగ్స్‌ గడువు ముగిసే వరకు సమ్మె చేయటం చట్ట వ్యతిరేకం. ఒకవేళ సమ్మె చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తూ సమ్మె చేసిన కార్మికులపై చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే క్లాసిఫికేషన్‌ కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌ (సీసీఏ) రెగ్యులేషన్‌ 9(1) ప్రకారం డిస్మిస్‌ చేసే అధికారం ఉంటుంది.

దమ్ముంటే డిస్మిస్ చేయండి : కార్మిక సంఘాల నాయకులు

కాగా దమ్ముంటే తనను డిస్మిస్‌ చేయాలని ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఎన్నడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం తాము పోరాడినోళ్లమని.. సమ్మెకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 36 రోజులైనా సర్కారు ఒక్క సమస్యయినా పరిష్కరించలేదన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో అనేకసార్లు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదని.. ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరు కారన్నారు. ఆర్టీసీతోనే ఈ సమ్మె ఆగదని.. ఇతర వర్గాలు సమ్మెకు ఉపక్రమిస్తాయని హెచ్చరించారు. అసలు ఈ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదని.. రాష్ట్ర విభజన కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీలాంటిదే ఇదీ అని ధ్వజమెత్తారు. సమ్మెకు దిగితే ఎస్మాను ప్రయోగిస్తామని, డిస్మిస్‌ చేస్తామని బెదిరిస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు.

ప్రతి డిపో వద్ద 144 సెక్షన్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రతి డిపో వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. ప్రతి డిపోకుఓ పోలీస్‌ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు నడిచేలా చర్యలు తీసుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లు ఉదయం 5 గంటలకు బయల్దేరుతాయని.. చివరి రైలు రాత్రి 11.30 గంటలకు బయల్దేరి 12.30 గంటలకు ఇతర టెర్మినల్‌ స్టేషన్లకు చేరేలా ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టికెట్‌ కౌంటర్లు, యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రద్దీ నిర్వహణ నిమిత్తం ఎల్బీనగర్‌, అమీర్‌పేట్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్‌ ఈస్ట్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మెట్రో సీనియర్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తారని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

మెట్రో కిటకిట

ప్రయాణికులు తీవ్ర అవస్థలు

త్రిసభ్య కమిటీతో మూడు రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో 4న అర్ధరాత్రి నుంచి బస్సులను బంద్‌ చేసి, సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మె వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పెద్దగా లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వాహనదారులపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

2015మేలో ఏం జరిగింది

2015మేలో ఆర్టీసీ కార్మికులు ఇలాగే సమ్మె సైరన్ మోగించారు. వేతన సవరణ గడువు దాటినా కొత్తది ప్రకటించలేదన్న ఆగ్రహంతో వారంతా సమ్మెకు దిగారు. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను హడావుడిగా తీసుకుని బస్సులను వారికి అప్పగించింది. ఆ సమ్మెలో దాదాపు 5 వేల బస్సులను మాత్రమే తిప్పగలిగారు. మొత్తం ఆరు రోజులపాటు సమ్మె కొనసాగింది. ఏడో రోజు కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవటం, వేతన సవరణకు అంగీకరించటంతో సమ్మె ఆగింది. అయితే ఈ సారి అదనంగా మెట్రో కూడా పరుగులు పెడుతోంది.  ఏం జరుగుతుందో చూడాలి.