Telangana: 'దిశ' ఎఫెక్ట్!  వచ్చే విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలో నైతిక విలువలు పెంపొందించే బోధనలు, నేర ప్రవృత్తి పెరిగినపుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని పోలీసులకు పరోక్షంగా సూచన
File image of Telangana CM KCR | File Photo

Hyderabad, January 3: సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు (Moral Values) పెంపొందించే విధంగా విద్యావిధానం (Education System) ఉండాలని తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అభిలషించారు. మంచి సమాజం నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డిజిపిల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం (Academic Year) నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. మాజీ డిజిపి హెచ్.జె. దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం మాట్లాడుతూ ‘‘దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతున్నది. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలి. మాజీ డిజిపిలతో కమిటీ వేస్తాం. ఆధ్మాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటాం. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘‘మంచిని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు’’ అని దిశ ఘటన మరియు నిందితుల ఎన్‌కౌంటర్ పై సీఎం పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

‘‘డిజిపి మహేందర్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమతం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలనలో, పేకాట క్లబ్బుల మూసివేతలో, బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో, హరితహారం ద్వారా చెట్లు పెంచడంలో ఎంతో కృషి చేశారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు తమవంతు పాత్ర పోషించాలి. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుంది. అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలి. చదువుకోని వారందరినీ అక్షరాస్యులగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

‘‘హెచ్.జె. దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్ వర్కుతో ఎలా విజయాలు సాధించవచ్చో, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మంగా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్ధతులు అవలంభిచాలో, ఉన్న వనరులతో ఎంత సమర్థవంతంగా పనిచేయవచ్చో దొర అనుభవం ద్వారా నేర్పారు. పుస్తకంలో కూడా అనేక విషయాలు చెప్పారు. వాటన్నింటినీ స్పూర్థిగా తీసుకుని పోలీసు అధికారులు ముందుకుపోవాలి. మానవ జీవితంలో మార్పులు అనివార్యం. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా మారుతూ కార్యాలు నెరవేర్చాలి. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలి. వారిలో ప్రొఫెషనలిజం పెరగాలి. దీనికి అవసరమైన చర్యలు డిజిపి తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘దేశంలో మనం ఏ ఊరికి వెళ్లి వెతికినా దళితులే పేదలుగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. దళితులు ఎదగాలి. తెలంగాణ రాష్ట్రంలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారు. దళితులను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ప్రవీణ్ సంకల్పానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. దళితుల్లో న్యూనతాభావాన్ని తీసేసి, తాము గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామనే భావన కల్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాలి’’ అని కేసీఆర్ అన్నారు.