Huzurabad, August 23: తెలంగాణలో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హుజురాబాద్‌లో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడతలో రూ.500 కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతలో రూ.500 కోట్లను (Telangana govt releases Rs 500 crore) ప్రభుత్వం విడుదల చేసింది.
హుజూరాబాద్ సభ అనంతరం ఈ పథకం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల కానుంది. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.