Representational Image | PTI Photo

Hyderabad, May 28: కోవిడ్ -19 చికిత్స పేరుతో రోగులను భారీ ఛార్జీలతో పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం నిర్ధేషించిన ఛార్జీలు కాకుండా లక్షల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రవ్యాప్తంగా 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రి ఇచ్చే వివరణ సహేతుకంగా లేకుంటే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. కోర్టుకు వెళ్లి కూడా స్టే తీసుకునే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

తాజాగా, హైదరాబాద్‌లోని విరించి హాస్పిటల్‌పై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆంక్షలు విధించింది. విరించి ఆసుపత్రి కోవిడ్ చికిత్స లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా పేషేంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేసింది. ఈ ఆసుపత్రితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని మరికొన్ని ఆసుపత్రులకు కూడా కరోనా చికిత్స రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజులు వసూలు చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97,236 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,527 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1441 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,71,044కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 519 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 188 కేసులు, రంగారెడ్డి నుంచి 207, నల్గొండ నుంచి 218 మరియు ఖమ్మం నుంచి 215 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 19 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,226కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 3,982 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,30,025 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.