Dharani Portal: అక్టోబర్ 3 నుంచి తెలంగాణ ధరణి పోర్టల్ ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్‌బుక్ జారీ, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయమన్న సీఎం కేసీఆర్
ఇక ముందు ఒక ఇంచు భూమి కూడా ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతి...
Hyderabad, September 24: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పుడు అమలులోకి తెస్తున్న రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం పేర్కొన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూ వివాదాలు , ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు సీఎం చెప్పారు.
రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ సహా ఇతర నేతలు మరియు ముఖ్య శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు అంశాలపై వివరణ ఇస్తూ అందుకు తగినట్లుగా ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న ఇండ్లు, ఫామ్ హౌజ్ లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు.
ఇక ముందు ఒక ఇంచు భూమి కూడా ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతి, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇండ్ల స్థలాలను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు పేదలకు కలుగుతుందని సీఎం పేర్కోన్నారు. ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్.ఆర్.ఎస్ కు ఏలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతిరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం వివరించారు. వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తులను ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సీఎం తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంపిటీసిలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం అన్నారు. ఎంపీఓలు దీన్ని పూర్తి స్తాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
ధరణి పోర్టల్ కావడంలో కాస్త ఆలస్యమైన పర్వాలేదు కానీ ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్వవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్ 3 నుంచి 'ధరణి పోర్టల్'ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
(The above story first appeared on LatestLY on Sep 24, 2020 12:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

