TS Dalit Empowerment Scheme: ఒక్కో నిరుపేద షెడ్యూల్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, దళితులపై దాడి చేసే పోలీసుల ఉద్యోగం తొలగింపు; అఖిలపక్షం నిర్ణయాలకు సీఎం ఆమోదం
CM KCR, All-Party Meeting | Photo: FB

Hyderabad, June 28: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు గాను 1200 కోట్లతో 'సీఎం దళిత సాధికారత పథకం' ప్రారంభం చేయాలని, ఎంపిక చేయబడిన బాటమ్ లైన్ లో ఉన్న కడు పేద దళిత కుటుంబానికి రైతు బంధు పథకం మాదిరి నేరుగా అందచేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అఖిల పక్షంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:

 

రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటికి పరిష్కార మార్గాలను చూడాలన్నారు. ఇప్పుడు అమలులో ఉన్న స్కీమ్ లను కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని వర్తింప జేయనున్నట్టు సీఎం తెలిపారు. గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రవేశపెట్టాల్సిన స్కీంలను వాటి వివరాలను లబ్ధిదారుల గైడెన్స్ కోసం తయారు చేసి అందించాలన్నారు.

➧ గ్రామీణ ప్రాంతాలలో చేయదగిన స్కీమ్ లు, డెయిరీ, తదితర స్వయం ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు.

➧ లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన స్కీమ్ లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. దీని కోసం మండలస్థాయిలో ఒక అధికారి ఉండాలి. ఇందుకు సంబంధించి ఎస్సీ కార్పోరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలె. అధునాతన సాంకేతిక విధానాలను అవలంబించి ప్రతీ లబ్ధిదారునికి ఒ కార్డును అందజేయాలె. బార్ కోడ్ ను కేటాయించి లబ్ధిదారుని పూర్తి వివరాలు కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.’’ అని సీఎం అన్నారు.

➧ ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారుచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సీఎం ఆదేశించారు.

➧ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ తో, దళిత విధ్యార్థుల కోసం, హై క్వాలిటీ స్టడీ సర్కిల్స్ ను ఎన్ని సెంటర్ లలో పెట్టగలమో పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటిని రూపొందించాలనీ, ఖర్చు ఎంతయినా ఫరవాలేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సెంటర్ల ద్వారా సివిల్ సర్వీసెస్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలని సీఎం ఆదేశించారు.

➧ దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు

➧ బాటమ్ లైన్ లో ఉన్న దళితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులక సూచించారు.

➧ గ్రామీణ దళితులు పట్టణ దళితుల అభివృద్ధి, దళిత యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు స్టడీ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం.

➧ పెండింగులో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి.

➧ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా వర్తిస్తుందని సీఎం తెలిపారు.

➧ భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకి కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చెప్పారు.

➧ దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన సభా సంఘం బాధ్యత తీసుకోవాలి.

➧ దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

➧ సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి కలిగించాలి.

➧ ఇక నుండి దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం ఆమోదం తెలిపారు.

➧ సమగ్ర దృక్పథంతో తెలంగాణ దళిత సమాజ సమగ్రాభివృద్ధి కోసం అఖిల పక్షం కీలక నిర్ణయాలు తీసుకున్నది.

➧ సీఎంఓ లో దళిత సాధికారత విషయంలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని సీఎం తెలిపారు.

➧ ఇదే అంశం మీద ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి పదిరోజుల పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలని సీఎం ఆదేశించారు.

➧ జూలై 1 లోపు మొదటి ఎస్సీ శాసనసభా సంఘం సమావేశం జరిపి ఒక జిల్లాను ఎంచుకొని ప్రభుత్వం నుండి రైతుబంధు పొందుతున్న 7,79,902 (13,38,361 ఎకరాలకు గాను) మంది దళిత రైతుల గురించి విచారించి, వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాలని సీఎం తెలిపారు.

➧ దళితులకు వందశాతం డబుల్ బెడ్ రూం ఇండ్ల కేలాయింపు అనే అంశం మీద ఒక స్ట్రాటెజీని రూపొందిస్తామని సీఎం తెలిపారు.

➧ దళితసాధికరత అమలు కోసం రిటైర్డు దళిత ఉద్యోగులు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు.