Hyd, August 10: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. హైదరాబాద్ లోని ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. ఎగ్జామ్ ను వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో అభ్యర్థులు నిరసనకు దిగారు. ముట్టడించేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు.
ఆగస్టు 1 నుంచి గురుకుల పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి తోడుగా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలు పరీక్షలు ఉన్నాయి. ఇక ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా వరుస దినాల్లో పరీక్షలు ఉండటంతో.... ఏ పరీక్షకు పూర్తిస్థాయిలో అట్టెంప్ట్ చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో వాయిదా వేయాలంటూ నిరసనకు దిగారు.
తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనిత రామచంద్రన్‌కు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, డాక్టర్ రియాజ్, తదితరులు వినతి పత్రం అందజేశారు.
Here's Protest Video
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ టీఎస్‌పీఎస్సీ ముట్టడికి భారీగా తరలి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు pic.twitter.com/KPhemaCLG1
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2023
గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ - 2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్ - 2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని అభ్యర్థులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ - 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. అభ్యర్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం జేఎల్, గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు.
గ్రూప్-2 రాతపరీక్షకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆగష్టు 29, 30 తేదీల్లో నాలుగు పేపర్లుగా గ్రూప్ 2 పరీక్షల్ని నిర్వహించనున్నారు. పరీక్ష తేదీలకి వారం రోజుల ముందు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు జారీ చేయనుంది.గ్రూప్-2లో 783 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేశారు. రాత పరీక్షలు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు కేటాయింపును సైతం కంప్యూటర్ ర్యాండమ్ పద్దతిలో నిర్వహిస్తున్నారు.
గతంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాక డబుల్ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తాయి. దీంతో ఫలితాల వెల్లడించడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది.ఈ దఫా నిర్వహించే గ్రూప్-2 పరీక్షల్లో ఎలాంటి సమస్యలు రాకుండా, వివాదాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కళాశాలలకు జిల్లా విద్యాధికారులు, ఇంటర్‌బోర్డు ద్వారా సమాచారం పంపించింది. ఆయా విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.