Telangana: మునుగోడులో కాల్పుల కలకలం, ద్విచక్రవాహనంపై వచ్చి వ్యాపారిని తుఫాకీతో కాల్చిన దుండగుడు
Representational image. (Photo Credit: GoodFreePhotos)

Hyd, August 5: మునుగోడు మండలంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు మరో బైక్‌పై వెనుక నుంచి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాటర్‌ బాటిల్స్‌ సరఫరా చేసే డీలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా జరిగిన గొడవలే దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్సై సతీష్‌రెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి(32) మునుగోడులో కూల్‌డ్రింక్స్‌, నీటి బాటిళ్లను విక్రయిస్తున్నారు. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ చేస్తూ బ్రహ్మణవెల్లంలలో ఉంటున్నారు. రోజు వారీగా దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిస్తోలుతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

పూజ చేస్తుండగా మేనకోడలి తల నరికేసింది, రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలిక వింత ప్రవర్తన, తల్లిదండ్రులపై కూడా కత్తితో దాడి, పదిరోజులుగా పూజలోనే ఉన్న బాలిక

కాల్పుల శబ్దాన్ని సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి విని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే లింగస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్‌ పడి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి కామినేని ఆసుపత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు డీఎస్పీకి చెప్పినట్టు సమాచారం.