Hyd, Oct 18: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరగనున్నాయి.ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు, శుక్రవారం అశోక్ నగర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. జీవో 29ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. గ్రూప్-1 అభ్యర్థులపై జరిగిన లాఠీఛార్జ్ మీద కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదన్నారు. లాఠీఛార్జ్‌ను ఆయన ఖండించారు. విద్యార్థులు న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే లాఠీఛార్జ్ చేస్తారా? అని ప్రశ్నించారు.