Hyderabad, Sep 7: తెలంగాణ హైకోర్టులో సెప్టెంబర్ 7 నుంచి ప్రయోగాత్మకంగా భౌతికంగా కేసులు విచారణ జరగనుంది. ఈ కేసుల విచారణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు నలుగురు న్యాయమూర్తులు జరపనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మార్గదర్శకాలను విడుదల చేసింది. లిస్టులో కేసులు ఉన్న న్యాయవాదులు, పిటిషనర్లను మాత్రమే అనుమతించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయవాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలను (TS High Court Guidelines) రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం జారీచేశారు
ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక కేసుకు సంబంధించి పిటిషనర్ తరఫున ఒకరు, ప్రతివాది తరఫున ఒక న్యాయవాది మాత్రమే హాజరుకావాలి. కోర్టు హాల్‌లో మొత్తం న్యాయవాదులు, కేసులను నేరుగా వాదించుకునే (పార్టీ ఇన్ పర్సన్స్) వారి సంఖ్య ఆరుకు మించడానికి వీల్లేదు. కేసు విచారణ పూర్తవుతూనే ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోవాలి. జూనియర్ న్యాయవాదులు, న్యాయవాదుల క్లర్కులతోపాటు ఇతరులెవరికీ ప్రవేశం లేదు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారెవరూ హైకోర్టు ఆవరణలోకి రావడానికి వీల్లేదు. మంత్రి హరీష్ రావుకు కరోనా, తెలంగాణాలో తాజాగా 2,511 మందికి కరోనా
న్యాయవాదులు సైతం తమ కేసు విచారణకు వచ్చే వరకూ వెయిటింగ్ హాల్స్ లేదా ఖాళీగా ఉన్న ఇతర కోర్టులో వేచి ఉండాలి. ఉదయం 7.30, 9.30 గంటలకు, సాయంత్రం 5 గంటల తర్వాత కోర్టు హాల్స్‌ను పూర్తిగా శానిటైజ్ చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనంతోపాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ జి.శ్రీదేవి బెంచ్‌లు భౌతికంగా కేసులను విచారిస్తాయి. హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలతోపాటు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి’’అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.