Hyd, Dec 31: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, న్యూఇయర్ వేడుకల రద్దు అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్స్ కోర్టుకు (Telangana High Court) తెలిపారు. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదన్న పిటిషనర్స్ కోర్టుకు తెలియజేశారు.
పిటిషన్లను విచారించిన హైకోర్టు ఒమిక్రాన్‌పై కీలక ఆదేశాలు ( immediately implement the guidelines) జారీ చేసింది. ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పబ్ లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచాలని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ నూతన సంవత్సర నియంత్రణ వేడుకలపై (new year restrictions) జోక్యం చేసుకోలేమని తెలిపింది.
ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారని గుర్తు చేసింది. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో 100 శాతం మొదటి డోసు పూర్తయిందని, రెండవ డోసు పంపిణీ కూడా 60 శాతం జరిగిందని గుర్తు చేసింది. మార్గదర్శకాలు ఉల్లఘించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ పరిస్థితులపై జనవరి 3 లోపు హైకోర్టుకు సబ్మిట్ చేయాలని కోరింది. తదుపరి విచారణను హైకోర్టు జనవరి 4కి వాయిదా వేసింది