Hyderabad, Sep 15: అక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు (TS High Court) నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను (Rebal MP raghurama petition) కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం నిన్న వ్యాఖ్యానించింది. తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ బదిలీని నిరాకరిస్తూ రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు రాకముందే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేశారంటూ సాక్షిలో వార్త ప్రచురించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సీబీఐ కోర్టు స్పందించింది. ఆ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.
కాగా అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కొన్ని రోజుల క్రితం వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ రద్దు పిటిషన్లపైనే సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వాలని, బెయిల్ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామ నిన్న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు హైకోర్టు దాన్ని కొట్టి వేసింది.