Hyd, Jan 4: ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ (Telangana High Court Single Bench) తిరస్కరించింది. కరీంనగర్‌లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో (Lunch Motion Petition) కోరారు. తనపై కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్ విన్నవించారు. అత్యవసర విచారణ చేపట్టాలన్న సంజయ్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే సంబంధిత కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ (MP Bandi Sanjay) తరపు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
ఇదిలా ఉంటే తనను అరెస్టు చేసేటప్పుడు కరీంనగర్ సీపీ సత్యనారాయణ గల్లా పట్టుకొని వ్యానులోకి తోసేశారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ బండి సంజయ్ సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. ‘జీవో 317ను సవరించాలంటూ ఉద్యోగులకు మద్దతుగా నేను ఎంపీ కార్యాలయంలో దీక్ష చేపట్టగా సీపీ తన సిబ్బందితో నా కార్యాలయానికి వచ్చారు. లోపలివైపు నుంచి తాళాలు వేసి ఉండటంతో గ్యాస్ కట్టర్లతో వాటిని కోసి తలుపులు బద్దలు కొట్టి లోనికి చొరబడ్డారు.
నన్ను అరెస్టు చేసేటప్పుడు సీపీ నా గల్లా పట్టుకున్నారు. నన్ను వ్యానులోకి తోశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్‌లో నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అరెస్టు సమయంలో సరిగా వ్యవహరించలేదు. ఎంపీగా నా గౌరవానికి భంగం కలిగించిన సీపీ సత్యనారాయణ, ఏసీపీ ప్రకాశ్, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ లక్ష్మీబాబుపై చర్యలు తీసుకోవాలి’అని స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు చేశారు. గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలోనూ కరీంనగర్ పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ, 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌లకు లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. సీఎం, ఇతరుల అధికార పార్టీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల కోసం జీవో 317కి వ్యతిరేకంగా తాను జాగరణ దీక్ష చేస్తే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు