Hyderabad, June 6: ఐటీ రంగంలో (IT Sector) దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ (Telangana) దూసుకుపోతున్నది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో (IT Exports) రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. అదే సమయంలో భారత్ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి సాధించిందని తెలిపారు. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేల కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 2.41 లక్షల కోట్లకు చేరుకొన్నామని వివరించారు. 2022-23లో ఐటీ ఉద్యోగాల్లో 16.29 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు.
ఏడాదిలోనే లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు
2021-22లో ఐటీ రంగంలో 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాలుంటే 2022-23 వరకు 9 లక్షల 5 వేల 715కు పెరిగాయని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు. సోమవారం టీ హబ్ వేదికగా 2022-23 ఐటీ శాఖ వార్షిక నివేదికను ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని, ఈ రంగంలో తొమ్మిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు.