Hyd, Feb 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు (Telangana Kanti Velugu) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడిచిన 25 రోజుల పని దినాల్లో కంటి వెలుగు పరీక్షలు నేటికి 50 లక్షల మార్కుకు చేరుకున్నది. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. గత నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అయితే 100 పని దినాల్లో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 16,533 సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఏడాది జులై 15వ తేదీ నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.గురువారం వరకు 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 34 లక్షల మందికి(68 శాతం) ఎలాంటి సమస్యలు లేవని తేలింది. మరో 16 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ 16 లక్షల మందిలో 9.5 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 6.5 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ సూచించారు.