Hyderabad, Sep 17: సర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) పరాక్రమం వల్లే హైదరాబాద్ రాష్ట్ర విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో (Telangana Liberation Day) అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని.. మజ్లిస్‌కు బీజేపీ భయపడదని అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు.
అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం ( Telangana vimochana dinotsavam) జరుపుతామని తెలిపారు. కర్ణాటకలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని అమిత్ షా గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయి. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్‌ను ఇస్తున్నామని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికలల్లో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. హుజురాబాద్ ఉప ఎన్నికలల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను అమిత్ షా పలుకరించారు. నిర్మల్ బహిరంగ సభలో నాయకులను సభకు ఆయన పరిచయం చేసారు. ఈ సందర్భంగా తనకు దూరంగా ఉన్న ఈటల రాజేందర్ ను ముందుకు రావలిసిందిగా ఆయన కోరారు. దీంతో సభంతా మార్మోగింది. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ రాజేందర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని హుజురాబాద్ ప్రజలను ఆయన కోరారు.
తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్‌కు భాజపా జయధ్వానాలు వినిపించాలన్నారు. తెలంగాణ విమోచన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు.
ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. పటేల్ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదన్నారు. తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత అమిత్ షాకే దక్కుతుందన్నారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు.