Telangana: తెలంగాణలో జూన్ 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం, మహారాష్ట్రలో గుర్తించబడిన డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సరిహద్దు జిల్లాలపై నిఘా
Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

Hyderabad, June 18: తెలంగాణలో సెకండ్ వేవ్ కోవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో జూన్ 20 నుండి రాష్ట్రంలో లాక్డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాత్రి 9 నుండి ఉదయం 7 గంటల వరకు మాత్రం నైట్ కర్ఫ్యూతో మరికొన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. కోవిడ్ -19 కేసులు ఇంకా అదుపులోకి రాని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించేలా లాక్డౌన్ ఎత్తివేసేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

మరోవైపు తెలంగాణ పొరుగునే ఉన్న మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనావైరస్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించి మహారాష్ట్ర టాస్క్‌ఫోర్స్ జారీ చేసిన హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా పరిగణించినట్లు తెలుస్తోంది. ప్రజలు కోవిడ్ -19 నిబంధనలు పాటించకపోతే డెల్టా ప్లస్ వేరియంట్‌ వ్యాప్తి పెరిగి మరో రెండు నెలల్లో కరోనావైరస్ యొక్క మూడవ వేవ్ ప్రారంభమవుతుందని టాస్క్‌ఫోర్స్ తెలిపింది. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే ఉమ్మడి ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరికొంత కాలం రెండు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలపై కఠినమైన నిఘా ఏర్పాటు చేయనుంది. జీవనోపాధి, వ్యాపార నిమిత్తం టీఎస్- మహారాష్ట్ర మధ్య సరిహద్దు ప్రజలు తరచూ ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉంది.

ఇక, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులన్ పరిశీలిస్తే.. గురువారం కొత్తగా మరో 1492  మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే చికిత్స పొందుతూ మరో 1933 మంది పూర్తిగా కోలుకోగా, ఇంకో 13 మంది మాత్రం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.