
Hyd, Dec 3: తెలంగాణలోని విద్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. వేర్వేరు గురుకులాలు, కేజీబీవీల్లో గురువారం 34 మంది విద్యార్థినులు కరోనా (Coronavirus in Telangana) బారినపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విద్యాసంస్థలో బుధవారం ముగ్గురికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
గురువారం 966 విద్యార్థినులకు గాను అనుమానం ఉన్న 300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా తేలింది.దీంతో అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. కోవిడ్ సోకిన బాలికలను ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచారు. ఇదే జిల్లా ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం మరో ఆరుగురు విద్యార్థినులు కరోనా (Coronavirus) బారిపడ్డారు. ఇటీవల ఈ విద్యాసంస్థలో 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకిన విషయం తెలిసిందే. గురువారం అనుమానం ఉన్న మరో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. స్కూల్‌లో మిగిలిన మొత్తం 426 మంది విద్యార్థులు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం/కళాశాలలో ముగ్గురు విద్యార్థినులకు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఆరుగురు రెండ్రోజులుగా జలుబు, దగ్గుతో గత బాధపడుతుండగా స్థానిక పీహెచ్‌సీలో వీరిద్దరికీ పరీక్ష చేయించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం కేజీబీవీలోని మొత్తం విద్యార్థినులకు పరీక్షలు చేయించగా, మరొకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Here's Update
#NewsAlert | 27 students test #Covid positive in #Telangana’s Sangareddy district.
Sowmit with more details. | #OmicronInIndia pic.twitter.com/MFYlhGQg3B
— TIMES NOW (@TimesNow) December 3, 2021
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,883 నమూనాలు పరీక్షించగా, 189 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,376 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,701 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,680 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,995కి పెరిగింది.