File image of Hyderabad City during lockdown | Photo: Twiter

Hyderabad, May 26: తెలంగాణలో సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీ కోవిడ్ కేసుల్లో కొద్దిపాటి హెచ్చు తగ్గులుంటున్నప్పటికీ సుమారుగా 3 వేల కేసుల చొప్పున నమోదవుతున్నాయి.  అయితే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని టీఎస్ ప్రజారోగ్య శాఖ సంచాలకులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 గంటల లాక్డౌన్ అమలులో ఉంది, ఈ లాక్డౌన్ గడువు మే 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్డౌన్ కొనసాగించడమా లేదా ఎత్తివేయడమా అనేది ఆరోజు మంత్రివర్గంలో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. అలాగే వ్యవసాయం, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు తదితర అంశాలపై కూడా క్యాబినెట్ చర్చించనుంది.

ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,048 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,762 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,210 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,63,903కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 528 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 213 కేసులు, రంగారెడ్డి నుంచి 229,  నల్గొండ నుంచి 218 మరియుఖమ్మం నుంచి 214  కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 20 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,189కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 3,816 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,22,082 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,632 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.