Hyd, Dec 22: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖమ్మంలో (Chandra Babu Khamma Tour) పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సెటైర్లు వేశారు.
చంద్రబాబు చేసిన షోను చూస్తుంటే ‘కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయితీస్తాడట’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో ఛీత్కారానికి గురై ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తా.. ఎనుకట ఏమో చేసిన దాన్ని ఉద్దరిస్తా అని బాబు (Chandrababu naidu ) మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఆయన మాటలు ‘సచ్చిపోయిన బర్రెనట.. పలిగిపోయిన బుర్రెడు పాలిచ్చిందట’ అన్నట్లుగా ఉన్నాయన్నారు. ఏపీ ప్రజలే పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తా అని మట్లాడుతున్నారన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలోనేనని హరీశ్‌రావు ఆరోపించారు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను పారద్రోలింది తానేనని చంద్రబాబు అంటున్నాడని, ఇంతకన్నా పెద్ద జోక్ ఉందా? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ కష్టాలను తీర్చింది ఒకే ఒక్క నాయకుడు కేసీఆరేనని, ఫ్లోరోసిస్ పేరు మీద మీరంతా ఓట్లు దండుకొని.. ఆ ప్రాంత ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
బాబు పాలనలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రైతులు ఉచిత కరెంటు ఇవ్వమని హైదరాబాద్ వస్తే బషీర్‌భాగ్‌లో పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర చందబాబుదన్నారు. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యంకాదని, తీగలపై బట్టలు ఎండేసుకోవాలని అవహేళన చేశారని.. ఇవాళ ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
2004లో ఓడిపోయిన తర్వాత రైతులకు అన్యాయం చేశామని, రైతులను నిర్లక్ష్యం చేసిన తర్వాతనే ఓడిపోయామని చంద్రబాబు చెంపలు వేసుకున్నారని గుర్తు చేశారు. వ్యవసాయం దండగా.. ఐటీ ముద్దు అనేది బాబు నినాదమని.. అది వట్టి నినాదమే తప్ప చేసిందేమీ లేదన్నారు. వ్యవసాయాన్ని ఇవాళ పండుగ చేసింది కేసీఆరేనని.. రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
ఎమ్మెల్సీ కవిత: తెలంగాణలోకి మళ్లీ రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారనా ఎమ్మెల్సీ కవిత అన్నారు.. టీడీపీ ఇప్పటీకే భూ స్థాపితమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవు’ అని అన్నారు.బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అనేది ఇప్పటికే పలుమార్లు రుజువైంది. పంజాబ్‌లో ఎన్నికలొస్తే క్షమాపణలు అడగాల్సిన పరిస్థితి మోదీది.
అందుకే రైతు వ్యతిరేక బీజేపీకి నిరసనగా రేపటి రైతు ధర్నాను నిజామాబాద్ తో పాటు ప్రతీ జిల్లాలోనూ విజయవంతం చేయాలని కవిత పిలుపు నిచ్చారు. బీజేపీ సర్కార్‌లో కార్పొరేట్లు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలందుకుని దేశసంపదకు చిల్లు పెడుతున్నారు. నల్లధనం తీసుకొస్తానన్న మోదీ హామీ ఏమైపోయిందని కవిత ప్రశ్నించారు.
మంత్రి గంగుల కమలాకర్ : తెలంగాణ వనరులను దోచుకునేందుకు మళ్లీ వస్తున్న పార్టీలు, నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలే నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఇక్కడి సంపదను, వనరులను దోచుకెళ్లడానికి వస్తున్నారని దుయ్యబట్టారు.
వైఎస్సార్ పార్టీ షర్మిల, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి పాల్ లాంటి వ్యక్తులు తెలంగాణ గడ్డపై రకరకాల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా చంద్రబాబు ఖమ్మంలో సభ నిర్వహించడంతో పాటుగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా కలిపేందుకు కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.
చంద్రబాబు ఖమ్మం టూర్ హైలెట్స్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన అవిష్కరించారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీకి మంచి ఆదరణ ఉందని మళ్లీ పుంజుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కేశావపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలో తెలుగు రాష్ట్రాల అంశం ప్రస్తావించారు. ఏపీలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి, అక్కడి ప్రజలను ఆదుకుంటానని, కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను అభివృద్ధి చేసి తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణలోనూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, వాటి పాటికి అవి పనిచేసుకుంటూ వెళితే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కొందరు బుద్ధిలేనివాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకువచ్చింది టీడీపీ అని, హైదరాబాదును అభివృద్ధి చేసింది టీడీపీ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఓటు అడిగే హక్కు అందరికంటే టీడీపీకే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవాళ తమకు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ ఎవరూ లేరని, కానీ ఎవరూ లేకపోయినా ఇవాళ ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో ధైర్యం కలుగుతోందని వివరించారు. తెలంగాణలో టీడీపీ నేతలు ఇప్పటిదాకా చురుగ్గాలేనివారు ఈ సభను చూసైనా క్రియాశీలకంగా మారాలని చంద్రబాబు సభాముఖంగా పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అనేవారికి ఇవాళ ఖమ్మం సభకు హాజరైన తమ్ముళ్ల ఉత్సాహమే జవాబు అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని, అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని అన్నారు.తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీదనే.. హైదరాబాద్‌లోనే. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమానికి పునాదులు వేసింది తెలుగుదేశమే.
తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది.. అనే వారికి ఖమ్మం సభే సమాధానం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లాంటి ముఖ్యనాయకులు ఎవరూ లేకపోయినా ఖమ్మం సభకు ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలిరావడం నాకెంతో ఆనందంగా ఉంది. తెలంగాణలో పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందన్న నమ్మకం, విశ్వాసం అందరిలోనూ కలుగుతోంది’’ అని అన్నారు.