
Hyd, June23: తెలంగాణలో కీసరలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కని పెంచిన తల్లి మృతిని తట్టుకోలేక (Missing their dead mother) తీవ్ర మానసిక వేదనతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు (two brothers end life) పాల్పడ్డారు. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుశీల భర్త మరో వివాహం చేసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉంటోంది. ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డికి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది.
అప్పటినుంచి ఆయన గండిపేటలో ప్రైవేటు ఉద్యోగంచేస్తూ అక్కడే ఉంటున్నారు. అతని సోదరులు యాదిరెడ్డి(30) మహిపాల్‌రెడ్డి (28) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంగీత పాఠశాలలో పనిచేస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లిసుశీల ఎనిమిది నెలల క్రితం కేన్సర్ వ్యాధితో మృతిచెందింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి ఇద్దరు సోదరులు దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లిపోయారు.ఈనెల 21న ఇద్దరూ ఇంటిని శుభ్రం చేసేందుకు రాంపల్లిదాయరకు వచ్చారు.
అయితే గండిపేటలో ఉన్న అన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పక్కింటి వారికి ఫోన్‌చేసి చెప్పారు.వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటం, మహిపాల్‌రెడ్డి పురుగు మందుతాగి కిందపడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో మృతులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, అమ్మ లేనందునే ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.