Hyd, Nov 21: ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో (Jogulamba Gadwal Government Hospital) చోటు చేసుకుంది. దీంతో డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద, సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
డెలివరీ చేసిన అనంతరం తమ డ్యూటీ అయిపోయిందని డాక్టర్లు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని ( doctor went out in middle of the delivery) బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఆసుపత్రిలో పట్టించుకునే వారు లేకపోవడంతో తమ పాప చనిపోయిందని బాధితురాలు వాపోయింది. డాక్టర్లు అందుబాటులో ఉండి ఉంటే తమ పాప దక్కి ఉండేదని, కానీ వాళ్ల నిర్లక్ష్యం వల్లే తాను చనిపోయిందని ఆరోపించింది. శిశువు మృతికి కారణమైన డాక్టర్లు, సిబ్బందిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని శిశువు బంధువులు డిమాండ్ చేశారు. కాగా.. ఆసుపత్రిలో తరచుగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే డాక్టర్ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్ అయినట్లు తెలిసింది. ధరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం.