Hyd, January 5: ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు మేరకు రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగగా అనంతరం వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరాకు 12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే వ్యవసాయ భూములు లేని రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసినట్టు చెప్పారు.
రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మూడూ జనవరి 26 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. వ్యవసాయం దండగ కాదు. పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రైతు భరోసా విషయంలో రైతాంగంలో రకరకాలుగా గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు శుభవార్త చెప్పాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్
భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయం అందించడమే కాకుండా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని నామకరణం చేశాం అన్నారు.
వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు అని స్పష్టం చేశారు.