Telangana News Bulletin: రూ.59కే కరోనా యాంటీ డ్రగ్ ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్‌, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..
Hetero launches generic Covid-19 drug 'Favivir' at Rs 59 per tablet (Photo-Twitter)

Hyderabad, July 29: కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జ‌రుపుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి (allola indrakaran reddy) కోరారు. జన సమూహం లేకుండా పండగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు వద్దని సూచించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, బోనాల‌ వంటి పండుగలను నిరాడంబరంగా జ‌రుపుకున్నామ‌ని తెలిపారు.వినాయ‌క చ‌వితి (Vinayaka Festival) పండ‌గ‌ను కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహించుకోవాల‌ని, దీనికి ప్రజలందరూ స‌హాక‌రించాల‌ని కోరారు. ప్రాణ హాని ఉందని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ, ప్రపంచ పులుల దినోత్సవం సంధర్భంగా అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..

కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న కరోనా యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘ఫావిపిరవిర్‌’ను (Favivir) ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటీరో (Hetero) బుధవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఫావిపిరవిర్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ధర రూ. 59గా నిర్ణయించినట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలన్న హైకోర్టు

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య భారీగా పెంచాలని హైకోర్టు (TG High court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన చర్యలు, డాక్టర్లు ఇతర సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశించా లని... ఇలా దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.

మూడో రోజుకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి న‌ర్సుల ధర్నా

జీతాలు ఇవ్వ‌డం లేదంటూ ఉస్మానియా ఆసుపత్రిలో (Osmania hospital)న‌ర్సులు చేప‌ట్టిన ద‌ర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెల‌లుగా జీతం ఇవ్వ‌డం లేదంటూ 87 మంది స్టాఫ్ న‌ర్సులు విధులు బ‌హిష్క‌రించారు. దీంతో గ‌త మూడు రోజులుగా 12 ముఖ్య విభాగాల్లో సేవ‌లు కుంటుప‌డ్డాయి. అవుట్‌సోర్సింగ్ కింద నాలుగు నెల‌ల క్రిత‌మే ఉద్యోగంలో చేరినా ఇప్ప‌టివ‌ర‌కు దీనికి అపాయింట్మెంట్ లెట‌ర్ ఇవ్వ‌డం లేద‌ని ఉద్యోగులు ఆందోళ‌న చేపట్టారు. త‌క్ష‌ణ‌మే అవుట్‌సోర్సింగ్ లెట‌ర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెల‌ల జీతం ఇస్తేనే విదులకు హాజ‌ర‌వుతామ‌ని డిమాండ్ చేస్తున్నారు.

వరవరరావును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి

భీమా కొరేగావ్‌ కేసులో నిర్భంధంలో ఉ‍న్న విప్లవ రచయిత వరవరరావును(varavara rao) కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు వారికి అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్‌కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు వీవీ ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విద్యారంగంతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన తదితర రంగాల్లో మాతృభాష వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, కొత్త పదాల సృష్టి జరిగినపుడే తల్లిభాషను పరిరక్షించుకోగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో జరిగిన వెబినార్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్‌పై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆర్కిటెక్ట్‌లు పొన్ని, ఆస్కార్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత సమావేశంలో సూచించిన మార్పులతో ఆర్కిటెక్స్ డిజైన్ రూపొందించారు. ఈరోజు ఫైనల్ డిజైన్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ డిజైన్ ఖరారు కాగానే ఆర్&బీ శాఖ అంచనాలు రూపొందించనుంది.

డాక్టరుపై కరోనా పేషెంట్‌ బంధువుల దాడి

వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌ బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ వార్డులోని అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జల వివాదాలపై ఆగస్టు 5న అత్యున్నత మండలి సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జల వివాదాలపై ఆగస్టు 5న అత్యున్నత మండలి సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌తో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రెండు రాష్ట్రాల ఫిర్యాదులతో అఫెక్స్ కౌన్నిల్ సమావేశం ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 81శాతం మందికి వైద్యం

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 81శాతం మందికి వైద్యం చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 5శాతం మందికి మాత్రమే వెంటిలేటర్, నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ అవసరమవుతోందని పేర్కొన్నారు. కోఠి డీఎంఈలో ఇంటెలిజంట్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీసెస్ బస్సులను ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో స్వాబ్ టెస్టులను చేయటానికి బస్సులు ఉపయోగపడుతాయని, ఒక్కో బస్సుకున్న పది కౌంటర్లు ద్వారా పరీక్షలు చేస్తామన్నారు. కరోనా కట్టడికి ప్రాణాలకు పణంగా పెట్టి కృషి చేస్తోన్న వైద్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

మాస్కులు ధరించని కారణంతో ఇప్పటి వరకు 35,308 కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా మాస్కులు ధరించని కారణంతో ఇప్పటి వరకు 35,308 కేసులు నమోదు అయ్యాయి. అలాగే భౌతిక దూరం పాటించనందుకు రాష్ట్రవ్యాప్తంగా 1211 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణపై 82 కేసులు నమోదు అయ్యాయి. వివాహాల్లో కరోనా నిబంధనలు పాటించనందుకు 24 కేసులు నమోదు కాగా, 101 మందిని అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంత్యక్రియలు జరిపినందుకు 6 కేసులు నమోదు కాగా, 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్

కరోనా పాజిటివ్ వస్తే భయపడవలసిన అవసరం లేదని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. డాక్టర్ల సలహాలు పాటించి కరోనాను జయించవచ్చన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

మంత్రి కేటీఆర్‌

అండర్‌ బ్రిడ్జ్‌తో ఫేతే నగర్‌ బ్రిడ్జ్‌పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్‌ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్‌ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్‌ వరకు బాలా నగర్‌ ప్లై ఓవర్‌ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తాం’ అని తెలిపారు.

అంబులెన్స్‌లో కరోనే పేషెంట్ డెలివరీ

కరోనా పాజిటివ్‌ వచ్చిన తొమ్మిది నెలల గర్భిణిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తూ సిద్దిపేట జిల్లా 108 సిబ్బంది మార్గమధ్యలో వాహనంలో మంగళవారం డెలివరీ చేశారు.హుజూరాబాద్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెను డెలివరీ నిమిత్తం ప్రత్యేక చికిత్స అందించడానికి 108 వాహనంలో హైదరాబాద్‌కు తరలించే క్రమంలో జిల్లాలోని నంగునూరు మండల 108 వాహన సిబ్బంది ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేటకు వద్దకు వెళ్లగానే మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే ఆమెకు సిబ్బంది డెలివరీ చేశారు. తల్లి పాప ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు, ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించినట్లు సిబ్బంది తెలిపారు.

డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత

బయోటెక్‌ రంగ ప్రముఖుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ (93) మంగళవారం కన్నుమూశారు. ఆయన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియా బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏబీఏ) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటుకు, 2019లో జరిగిన బయో–ఆసియా సదస్సుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. 1999లో హైదరాబాద్‌ లో బయోటెక్నాలజీ స్థాపనకు బజాజ్‌ ఒక ప్రమోటర్‌గా పనిచేశారు.

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను కొనుగోలు చేసిన సింగరేణి సంస్థ

సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు, ప్రైవేటు ఆసుపత్రులతో అత్యవసర సేవల ఒప్పందం వంటి చర్యలు చేపట్టింది. ర్యాపిడ్‌ టెస్టుల కోసం ఐదువేల కిట్లతో పాటు, కరోనా వ్యాధి నివారణ కోసం హెటిరో సంస్థ తయారు చేసిన 1,800 ఖరీదైన ఇంజక్షన్‌ డోస్‌లను కూడా కొనుగోలు చేసినట్లు సంస్థ ఎండీ ఎన్‌.శ్రీధర్ చెప్పారు.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రవేశానికి కాలపరిమితి సవరణ

కోవిడ్ -19 మహమ్మారి నేప‌థ్యంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మ‌ను) 2020-21 విద్యా సంవత్సరం రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి కాలపరిమితిని సవరించింది. ప్రవేశ ప‌రీక్ష‌ ఆధారిత కోర్సులకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 24 కాగా, మెరిట్ ఆధారిత కోర్సులకు చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన‌ట్లు ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌నో పేర్కొంది. ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఫలితాల‌ను సెప్టెంబర్ 30న ప్రకటించనున్న‌ట్లు వెల్ల‌డించింది.