AP News Bulletin: ప్రాణ హాని ఉందని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ, ప్రపంచ పులుల దినోత్సవం సంధర్భంగా అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..
CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, July 29: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ. 70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.59కే కరోనా యాంటీ డ్రగ్ ట్యాబ్లెట్‌, ఫావిపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన హెటిరో

ఇటీవల కోవిడ్-19 బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొడుమూరు సుధాకర్‌ ( YSRCP MLA Sudhakar) మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.

ప్రాణాపాయం ఉందని కేంద్రానికి ఎంపీ రాజు లేఖ

ఏపీ ప్రభుత్వం (AP Govt) కరోనాను అరికట్టలేకపోతోందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. కరోనా కేసులు పెరగడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. వైద్యం అందించకపోతే డాక్టర్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు.. కానీ డాక్టర్లకు ముందు కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చొరవతో ఇసుక సరఫరా పరిస్థితి చాలా మెరుగుపడిందని అభినందించారు. ఇక నాకు ప్రాణాపాయం ఉంది. అందువల్ల తక్షణమే కేంద్ర బలగాలతో వ్యక్తిగత భద్రత కల్పించాలి’ అంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన హోంశాఖ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.

38 ఎల్పీజీ దహన వాటికల ఏర్పాటు

సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో కొత్తగా 38 ఎల్పీజీ దహన వాటికలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) తెలిపారు. రూ.51.48 కోట్లతో శ్మశాన వాటికల్లో వసతులను నవంబరు నాటికల్లా అందుబాటులోకి తీసుకువస్తాయని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిథిలో కనీసం ఒకటి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి తెస్తామని అన్నారు.

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ 211వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్‌ సీజీఎం సుధీర్‌కుమార్‌.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గార్డ్, ఆర్బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతాదాస్‌ తదితరులు హాజరయ్యారు. 2020–21 సంవత్సరంలో 2,51,600 కోట్ల రుణాల లక్ష్యమని ఏపీ సీఎం తెలిపారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

హైకోర్టులో విచారణ

పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పేరుతో ప్రభుత్వం భూముల కొనుగోలుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేసేందుకు గడువు ఇవ్వాల్సిందిగా కోర్టును ప్రభుత్వం కోరంది. దీంతో విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మచిలీపట్నం లాక్ డౌన్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ (Lockdown) విధించారు. ఆగష్టు 3 నుంచి 9 వతేదీ వరకు లాక్ డౌన్ అమలు కానుంది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సమీక్షా సమావేశంలో మంత్రి పేర్ని నాని నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు

జీజీహెచ్‌లో కరోనా రోగి దుర్గా ప్రసాద్ అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యింది. న్యాయవాది నర్రా శ్రీనివాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వ్యక్తి చేరాడు. తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

కోవిడ్‌పై చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) పేర్కొన్నారు.కరోనా పరీక్షల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా ఏపీ ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనా డెత్‌ రేట్ తక్కువగా ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యంత పారదర్శకంగా కరోనా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు

ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 3727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు దేశంలోనే అతిపెద్దదని, ప్రస్తుతం అక్కడ 60 పులులు ఉన్నాయని పేర్కొన్నారు.

మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా 13 మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్‌(ఎస్ఎఆర్ఎఫ్)కు పైలెట్ ప్రాజెక్టుగా ఆ 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే ఎంపిక చేసింది.ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శ్రీకాకుళంలోని జీడీసీ (ఎం), విజయనగరం జిల్లా సాలూరులోని జీడీసీ,విశాఖలో డాక్టర్ వీఎస్ కృష్ణా జీడీసీ, రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కాలేజీ (ఏ), పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎసీఐఎం, కృష్ణా జిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ, గుంటూరులో మహిళా డిగ్రీ కాలేజీ, ఒంగోలులో మహిళా డిగ్రీ కాలేజీ, నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీ, అనంతపురంలో పురుషుల డిగ్రీ కాలేజీ, చిత్తూరులో పీవీకేఎన్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కడపలోనిపురుషుల డిగ్రీ కాలేజీని ఎఆర్ఎఫ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.

ఊపందుకున్న విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులు

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులు ఊపందుకున్నాయి. లైట్‌ మెట్రోరైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ చేతిలో సిద్ధమవుతోంది. లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్‌ను అప్‌డేట్‌ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్‌ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రూ.3.38కోట్లకు అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.మొత్తం 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.