Hyderabad, December 28: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుందనుకుంటున్న దశలో కొత్త వేరియంట్ కరోనా ఇప్పుడు మళ్లీ దడ పుట్టిస్తుంది.
ఇటీవల యూకె నుండి తెలంగాణకు తిరిగి వచ్చిన 279 మంది ప్రయాణికుల జాడ తెలియరాలేదని రాష్ట్ర ఆరోగ్య అధికారులు వెల్లడించారు. తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 184 మంది తప్పుడు ఫోన్ నంబర్, చిరునామాలు ఇవ్వగా, మిగతావారు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు కర్ణాటకకు తరలిపోయారని తెలిపారు. ఇక బ్రిటన్ నుండి తిరిగి వచ్చిన ప్రయాణీకుల ద్వారా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది.
మరోవైపు రాష్ట్రంలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 27,244 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 205 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 369 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 67,50,954 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 285,068కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల కాలంలోనే అత్యల్పంగా 54 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 551 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో277,304 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,231 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.