COVID19 in TS: కోవిడ్19 సెకండ్ వేవ్ మరియు వైరస్ యొక్క కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ
COVID-19 in India (Photo Credits: PTI)

Hyderabad, February 24:  దేశంలో కోవిడ్ -19 తీవ్రత ఇక తగ్గిపోయిందనుకుంటున్న దశలో  'కరోనా సెకండ్ వేవ్' మొదలైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాకుండా  కరోనావైరస్ యొక్క రెండు ప్రమాదకరమైన కొత్త రకాలు మహారాష్ట్ర మరియు కేరళలో గుర్తించబడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ రాష్ట్రాల నుండి నివేదించబడుతున్న కొత్త కేసులలో ఎన్ 440 కె మరియు ఇ 484 కె అనే రెండు కొత్త కరోనావైరస్ వేరియంట్లు కనుగొనబడ్డాయని తెలిపింది. ఈ రెండింట్లోని ఒక రకం వైరస్ తెలంగాణ రాష్ట్రంలోనూ గుర్తించబడిందని ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది.

కేంద్రం తాజా నివేదికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా దాదాపు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో వచ్చే రోగుల శాంపుల్స్ లలో కొత్త వేరియంట్లను నిర్ధారించడానికి ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) వంటి పరిశోధనా కేంద్రాలను ఉపయోగించుకోనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నందున ఎలాంటి భయం అవసరం లేదని, రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్లయితే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు.

అంతేకాకుండా, ఇకపై నుంచి రోజువారీ కోవిడ్ హెల్త్ బులెటిన్ జారీ చేయకూడదని తెలంగాణ ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బదులుగా ప్రతీ వారానికోసారి వీక్లీ బులెటిన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున్న, టీకాల పంపిణీకి సంబంధించిన నివేదికలను వెల్లడించనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.