Telangana Rythu Bandhu: రైతు బంధు మూడో రోజు రూ.1312.46 కోట్లు జమ, 10, 78,634 మంది రైతుల ఖాతాల్లోకి, మూడు రోజులలో 47,09,219 రైతుల ఖాతాల్లో రూ.3133.21 కోట్లు జమ చేశామని తెలిపిన మంత్రి
Singireddy Niranjan Reddy (Photo-Twitter)

Hyd, June 30: రాష్ట్రంలోని ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు (Telangana Rythu Bandhu) జ‌మ చేస్తున్నామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్ష‌లు పెడుతామ‌ని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపారు. వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఖండించారు.

రైతు బంధు (Rythu Bandhu) మూడో రోజు రూ.1312.46 కోట్లు జమ అయ్యాయని మంత్రి తెలిపారు. 10, 78,634 మంది రైతుల ఖాతాలలో ఈ నగదు జమ చేసినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. మూడు రోజులలో 47,09,219 రైతుల ఖాతాలలో రూ.3133.21 కోట్లు జమ చేశామని ఆయన అన్నారు. ఈ దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, వ్యవసాయ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కొనియాడారు.

రైతు బంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు, ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు జ‌మ చేస్తున్నామ‌ని తెలిపిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, తొలి రోజు రూ.586.65 కోట్లు విడుదల

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యధిక శాతం మంది ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగానికి చేయూత ఇవ్వాలన్న ముందుచూపు కేంద్రంలోని బీజేపీ పాలకులకు కొరవడింది. ప్రభుత్వరంగ సంస్థలన్నీ తెగనమ్ముతూ ఆఖరుకు ఆహారరంగాన్ని కూడా కార్పోరేట్ల పరం చేసే కుట్రలు పన్నుతున్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు పట్టుదలతో పోరాడడంతో జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలను రద్దు చేశారు. రైతుల పట్ల రాష్ట్ర బీజేపీ నేతలది మొసలికన్నీర అని మంత్రి మండిపడ్డారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఎందుకు రాదని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు మార్చి కేంద్రం రైతుల గొంతుకోయాలని చూస్తున్నది. మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో దివాళా తీసింది. తెలంగాణకు ఎనిమిదేళ్లలో కేంద్రం ఏమిచ్చింది ? బీజేపీ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ప్రధానమంత్రి మోడీ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని మంత్రి అన్నారు.

బీజేపీ సర్కారు మీద మంత్రి సంధించిన ప్రశ్నలు ఇవే..

ఏ రంగంలో విజయం సాధించారని విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారు ? జీఎస్టీతో చిన్న వ్యాపారుల పొట్టకొట్టి రాష్ట్రాల ఆదాయం ఎత్తుకెల్లినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతుల పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని పేదలను మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? నల్లధనం తెస్తానని దేశ ప్రజలను మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? కరోనా కష్టకాలంలో వలస కూలీలను, పేదలను, వారి ప్రాణాలను గాలికి వదిలేసి చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? కరోనా విపత్తులో ఆఖరుకు ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకుండా చేసి పేదల ప్రాణాలను పణంగా పెట్టినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? దేశంలో పేదల రుణాలపై వడ్డీ భారం మోపుతూ కార్పోరేట్ల రుణాలు 11 లక్షల కోట్లు మాఫీ చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? నల్లచట్టాలు తెచ్చి రైతులను రోడ్ల మీదకు తెచ్చి 700 మంది ప్రాణాలను బలిగొన్నందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? ఉపాధిహామీకి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి రైతులను మోసం చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? ఎరువుల ధరలు పెంచి సబ్సిడీలను ఎత్తేసి రైతుల నెత్తిన భారం మోపుతున్నందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి వాటి ధరలను ఎనిమిదేళ్లలో రెట్టింపు చేసినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? 67 ఏండ్లలో 54 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎనిమిదేండ్లలో వందలక్షల కోట్లు అప్పు చేసి రూ.154 లక్షల కోట్ల అప్పు దేశం నెత్తిన పెట్టినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా ? దేశం ప్రశ్నిస్తున్నది .. ప్రధాని మోడీ సమాధానాలు చెప్పాలని మంత్రి తెలిపారు.