Hyderabad, May 14: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుత కలకలం (Leopard in Hyderabad) సృష్టించింది. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లిలోని (Mylardevpally)అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద చిరుత గాయాలతో రోడ్డుపై కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు (Forest and zoo officials) సమాచారం అందించారు. అయితే అంతకుముందు అక్కడ కనిపించిన వ్యక్తిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన సుబానీకి గాయాలు అయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. కాటేదాన్, బుద్వేల్ వాసులు బయటకు రావొద్దని సూచించారు. కుక్కల అరుపులు వినిపస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అలసిపోయిన చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 69 శాతం కోలుకున్న కరోనా బాధితులు, యాక్టివ్ కేసుల సంఖ్య 4 వందల లోపే; లాక్డౌన్ సడలింపుల వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్న వైద్య, ఆరోగ్య శాఖ
అగ్రికల్చర్ యూనివర్సిటీ వైపు నుంచి చిరుత వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు అని డీసీపీ పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసులతోపాటు, అటవీ అధికారులు కూడా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్‌లోకి చిరుత వెళ్లింది. ఆ తోటలో ఎక్కడ దాక్కున్నది తెలియరాలేదు. ముమ్మరంగా గాలిస్తున్నారు. అక్కడక్కడ బోనులు, వలలు ఏర్పాటు చేశారు. అటవీ శాఖకు చెందిన 8 బృందాలు రంగంలోకి దిగారు.