Hyderabad, Dec 7: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ (PET Candidates Protest at CM Camp Office) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని లేదా తమకు కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని గురుకుల పీఈటీ అభ్యర్థులు (PET Candidates) డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. గత నాలుగేళ్లుగా పోస్టు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని అభ్యర్థులు (Gurukula PET Candidates) వాపోయారు.
సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్‌లతో సీఎం క్యాంప్ కార్యాలయం (Pragathi Bhavan) వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో అభ్యర్తులు నిరసనకు దిగారు. కారుణ్య మరణాలే శరణ్యం అంటూ.. ప్రగతి భవన్ వద్ద మహిళా అభ్యర్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ లోపలికి చొచ్చుకు పోయేందుకు వారంతా ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అభ్యర్థుల ఆందోళనతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే ప్రగతి భవన్ వద్ద ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూమిని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని స్థానిక పోలీసులు చూస్తున్నారని ఆరోపిస్తూ శామీర్‌పేట మండలంకు చెందిన రైతు బిక్షపతి ఆయన భార్య బుచ్చమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో వెంటనే తేరుకున్న పోలీసులు వారిదర్నీ అదుపులోకి తీసుకున్నారు.