Hyd, Feb 28: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటోంది. నిన్న చేవెళ్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ ను మగాడివైతే వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
దీనిపై తాజాగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (BRS MLA Kadiyam Srihari) మండిపడ్డారు. బుధవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానమని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు.
సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీ మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపైన మేం చర్చకు రెడీ. ప్రశ్నిస్తే మాపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో.
సీఎంగారు మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన మాకు లేదు. మీ ఆంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింద ఇచ్చిందే కదా నీ కుర్చీ. ఇందిరాగాంధీ నామజపంతో కులుకుతున్న పార్టీ మీది. మీది జాతీయపార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ మీది. ఆప్ కంటే అద్వాన్నంగా మారింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.
మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నాం. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డ కు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే. కూలిపోయిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు అలోచన చేస్తున్నారు.