Revanth Reddy (photo-Video Grab)

చేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా... నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఆ సన్నాసులకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను.... మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా చెబితే మా కార్యకర్తలు వారిని పట్టుకొని వేపచెట్టుకు కట్టేసి లాగుల్లో తొండలు విడిచి కొడతారని హెచ్చరించారు.

తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే రూ. 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఇప్పుడు నేనే సీఎంను, నేనే పీసీసీ చీఫ్‌ను... రానున్న లోక్ సభ ఎన్నికల్లో మీకు చేతనైతే... మీకు దమ్ముంటే... నువ్వు మొగోడివైతే... తెలంగాణలో... బిడ్డా ఒక్క సీటు గెలిచి చూపించు అని సవాల్ చేశారు. అల్లాటప్పాగాడు అని నువ్వు అనుకుంటున్నావేమో... మేం అయ్య పేరు చెప్పుకోలేదు... కిందిస్థాయి నుంచి... కార్యకర్తగా కష్టపడి... లాఠీదెబ్బలు తిని... నీ అక్రమ కేసులు ఎదుర్కొని... చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో మగ్గినప్పటికీ... భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను... నీ అయ్యను... నీ బావను... బొందపెట్టి ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నా" అన్నారు. ఈ కుర్చీ తనకు ఇనామ్ కింద వచ్చింది కాదని... అయ్య పేరు చెబితే వచ్చింది కాదన్నారు.

Here's Videos

ఈ రోజు ఆ కుర్చీ తనకు ఉందంటే అది కార్యకర్తల త్యాగం... పోరాట ఫలితమే అన్నారు. ఈ కార్యకర్తలు తనను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు... నువ్వు పుట్టించిన నీ అయ్య కూడా కాదు... వాళ్ల దేవుడు వచ్చినా ఆ కుర్చీని మీరు తాకలేరని వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి అన్నారు. కేసీఆర్ మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? అని సూటిగా ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పి పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడాను. నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చాను. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరు’’ అని స్పష్టం చేశారు.

సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం, తప్పక అమలు చేసి తీరతామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మహాలక్ష్మి, గృహ జ్యోతి ప్రారంభం

‘నీళ్ళ ముసుగులో భారీ దోపిడీ జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కళ్లలో కట్టెల పొయ్యితో నీళ్ళు రావొద్దని.. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నాం. పథకాలు రాలేదని బాధపడోద్దు. ఎమ్మార్వో, ఎంపీడీవో దగ్గరకు వెళ్ళి ఉచిత విద్యుత్ పథకం, రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందించే పథకం అందివ్వాలని కోరుతున్నా. కార్యకర్తలు కష్టపడితేనే మేము నాయకులం అయ్యాం. 14 ఎంపీలను గెలిపించే బాధ్యత మనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది. 5 మంది సభ్యులతో ఇందిరమ్మ కమిటీతో పథకాలు అమలు చేస్తాం.

అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మరిచిపోతారనీ అంటారు. నేను మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తా. జిల్లాలు,నియోజకవర్గాల్లో తిరుగుతా. బీజేపీ చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే ఎంటి?. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు ఏమైంది?. మా ఊర్లో వడ్లు కొనేవారు లేదు. తాండూరులో కందులు కొనేవాళ్లు లేరు. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలు పడగొట్టడమా!. ఎన్నికలు వస్తె బీజేపీ నేతలు ఈడి, సీబీఐలను పంపుతారు. బీజేపీ వాళ్లకు ఓటు వేయడం దండగ. కార్యకర్తలు గెలిచినప్పుడే కాంగ్రెస్‌ది నిజమైన గెలుపు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గమంటూ లేదని రేవంత్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని.. వాళ్ల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఎంపీలను గెలిపించడంతోనే తమ బాధ్యత తీరిపోదని, పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? కేడీ.. మోదీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు నాటకాలు ఆడుతున్నారు. త్వరలో మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మళ్లీ ఇందిరమ్మ కమిటీలను పునరుద్ధరిస్తాం. కాంగ్రెస్‌ అభయహస్తం హామీలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలి’’ అని దిశానిర్దేశం చేశారు.