
Hyderabad, December 11: కొవిడ్ వ్యాక్సిన్ల సమర్థతపై నిపుణులు ఒకవైపు ఇంకా చర్చలు జరుపుతుండగా, మరోవైపు తెలంగాణ రాష్ట్రం మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు వేగంగా ఎలా పంపిణీ చేయాలనే దానిపై ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసేలా రాష్ట్ర ఆరోగ్య అధికారులు విస్తృతమైన ప్రణాళికను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం, నాలుగు వేర్వేరు వర్గాల కింద ఎంపిక చేయబడిన దాదాపు 70 లక్షల మంది ఒక వారంలో వ్యాక్సిన్ పొందుతారు.
"వారంలో 70 లక్షల మందిని కవర్ చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం మరియు రెండు మూడు వారాలలో రెండవ మోతాదును పునరావృతం చేయాలనే ఆలోచన ఉంది. ఇందుకోసం రాష్ట్రంలో ఎంపిక చేయపడిన 10,000 సహాయక నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభమైంది" అని రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్ధారించిన పరీక్షల మేరకు 56,178 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 612 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 677 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,29,209 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 276,516కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 144 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 60 మరియు రంగారెడ్డి నుంచి 73 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.


మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1485కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 502 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 267,427మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,604 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.