Hyd, Jan11: వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని తన బులిటెన్ లో పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. బుధ, గురు వారాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (IMD issues yellow alert ) జారీ చేసింది.
మంగళవారం అసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన కురుస్తుందని హెచ్చరించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు మండలాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల బీభత్సంతో కరీంనగర్‌లో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చొప్పదండి, రామడుగు, మానకొండూరు, శంకరపట్నం, జగిత్యాల జిల్లా పెగడపల్లి, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో విద్యుత్ స్తంభాలు నేలకూలగా.. చెట్లు విరిగిపడ్డాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీత భవన్ వద్ద భారీ విద్యుత్ అలంకరణ లుమినార్ కూలిపోయింది. కర్రలతో 70 అడుగుల ఎత్తున లుమినార్‌ను ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం నిర్మించారు. రూ.45లక్షలతో ఏర్పాటు చేశారు. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా కటౌట్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాలకు వెళ్లే తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు రోడ్లపై వృక్షాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ఆసిఫాబాద్ మండలం గుండి వాగు పై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరదకు కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాగుకు అవతలవైపు ఉన్న గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెబ్బెన మండలం కొండపల్లిలో రాళ్ల వర్షం కురిసింది. పెంచికల్పేట్ మండలానికి వెళ్లే రహదారిపై వృక్షాలు విరిగిపడి రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలో ఉదయం ఏడుగంటల నుంచి సుమారు పది గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిర్మల్, నేరడిగొండ, బజార్ హత్నూర, ముథోల్, సారంగపూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, సోన్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షంతో శనగ, గోధుమ, జొన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈదురుగాలులకు జొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. ఉదయం నుంచి వర్షం కారణంగా వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.