
Hyderabad, January 11: జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నివారణకు టీకా పంపిణీ జరుగుతుందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 139 టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, మొదటి రోజున సుమారు 13,900 మంది టీకా అందుకోనున్నారు. తొలి ప్రాధాన్యం ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.90 లక్షల మంది టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.
ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 24,785 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 224 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 450 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72,78,021 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,008కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా 56 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

