
Hyderabad, March 23: తెలంగాణలో రోజురోజుకి పెరుగుతూపోతున్న కోవిడ్ కేసులతో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ నిర్ధారణ పరీక్షల (ఆర్టీ-పిసిఆర్) సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. అలాగే పెరుగుతున్న కేసులకు తగినట్లుగా చికిత్స కోసం వీలైనన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉంచటంతో పాటు గాంధీ ఆసుపత్రిలోని COVID-19 వార్డులలో మరియు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ అధికారులను ఆదేశించారు.
మరోవైపు ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని మంత్రి ఈటల కోరారు. ప్రజల సహకారం లేకుండా సంపూర్ణంగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించలేమని ఆయన అన్నారు. బయటకు వెళ్తే మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం, క్రమం తప్పకుండా చేతులను కడుక్కోవటం అలవాటు చేసుకోవాలని కోరారు. నిజంగా అవసరమైతే తప్ప అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి కోరారు.
తెలంగాణలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 68,171 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 412 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 805 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,03,867కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 103 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 27 కేసులు, మేడ్చల్ నుంచి 31 మరియు నిర్మల్ జిల్లా నుంచి 32 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,674కు పెరిగింది.
అలాగే సోమవారం సాయంత్రం వరకు మరో 216 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,99,042 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,151 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
కరోనా రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాలని ప్రజారోగ్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు.