Hyderabad, Dec 14: తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు (Non Agricultural Land Registrations) నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న నేపథ్యంలో గత సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయగా, ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను (Non Agriculture Properties) ప్రారంభించనున్నారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.
నేటి నుంచి ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఈ-పాస్ పుస్తకం అందించనున్నారు. ముందస్తుగా స్లాట్‌బుక్ చేసుకున్నవారికే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తారు. దీనికోసం శుక్రవారమే స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ ద్వారా స్లాట్‌బుకింగ్ అవకాశం కల్పించారు. అదేవిధంగా మీ-సేవా కేంద్రాల్లో రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజుకు 24 స్లాట్లనే కేటాయించారు.
హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
అయితే అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారా? లేదా ? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించని అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను జరపబోమని సంబంధిత జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్ల విషయంలో రెండు, మూడు రోజుల్లో విధానపర నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గత శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కానీ, ఆదివారంరాత్రి వరకు ప్రభుత్వం (Telangana govt) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారు
రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన పాతవెబ్ పోర్టల్ ధరణీ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో సబ్ రిజి స్ట్రార్ల విచక్షణాధికారాలను రద్దు చేసింది. ఆస్తి పన్నుల ఇండెక్స్ నంబర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరపనుంది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజుకు 24 స్లాట్లనే కేటాయించారు. ఒక్కో స్లాట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 15 నిమిషాలు కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగులు శని, ఆదివారాల్లో కూడా పనిచేయనున్నారు