Hyderabad, June 21: తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుండటంతో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో వివిధ రకాల సేవలు, కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఏడాదికి పైగా విరామం తర్వాత మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఎంఎంటిఎస్) రైలు సర్వీసులు బుధవారం నుంచి హైదరాబాద్ నగరంలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. బుధవారం ఉదయం 7:50 నుంచి లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ఫలక్ నుమా బయలుదేరుతుంది. కరోనా మహమ్మారి కారణంగా జంట నగరాల్లోని MMTS సేవలను మార్చి 23, 2020 నుండి నిలిపివేశారు.
ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,19,537 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,197 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 965 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,14,399కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 137 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 84, సూర్యాపేట నుంచి 72 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 71 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 9 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,576కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1707 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,93,577 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.